విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో కూరగాయల మార్కెట్ ను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి తరలించారు. పట్టణం మధ్యలో ఉన్న కూరగాయల మార్కెట్ ఇరుకుగా ఉన్న కారణంగా అధికారులు పాత కూరగాయల మార్కెట్‌ను తరలించారు. ప్రజలంతా అక్కడికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేయాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఒకరికొకరు దూరంగా ఉండి సరుకులు కొనుక్కోవాలని పోలీసులు మైక్‌లో సూచించారు.
చోడవరంలో ఎమ్మెల్యే సమీక్ష
వైరస్ నివారణ విషయంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై.. చోడవరంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చేపట్టిన అప్రమత్తత చర్యలపై మాట్లాడారు. ఎన్ఆర్ఐల విషయంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఇంట జరిగే వివాహ వేడుక రద్దు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇంటికే పరిమితం కావాలన్నది ప్రభుత్వ ఆదేశమని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం జగన్ కూడా.. తమ ఇంట్లో పెళ్లి వాయిదా వేయాలని సూచించారని.. అందుకే ఏప్రిల్ 8న జరగాల్సిన తమ అమ్మాయి డా.సుమ వివాహాన్ని వాయిదా వేశామని ఎమ్మెల్యే తెలిపారు.
ఎలమంచిలిలో లాక్డౌన్...
విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో లాక్డౌన్ అమలులో భాగంగా ఉదయం ఆరు గంటలకే ప్రజలు మార్కెట్క్ వెళ్లి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 11 గంటల తర్వాత ఎవరూ ఇల్లు విడిచి బయటికి రాలేదు. రద్దీగా ఉండే మార్కెట్లను బహిరంగ ప్రదేశాల్లోకి మార్చారు. పోలీసులు నిరంతరం నిఘా వేసి ఇతర ప్రాంతాల నుంచి పట్టణంలోకి ఎవరూ రాకుండా కట్టడి చేశారు.
చోడవరంలో...
చోడవరంలో కొవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక చర్యలు చేపట్టిన యంత్రాంగం అనుమానితులు ఉంటే వారిని చికిత్సకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను 30 పడకల వార్డు సిద్ధం చేశారు.
అరకు లోయలో..
విశాఖ జిల్లా అరకు లోయ ప్రాంతంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల నేపథ్యంలో గ్రామాల్లోకి బయటి వారు ఎవరు అడుగు పెట్టకుండా గిరిజనులు రహదారులను దిగ్బంధం చేశారు. రహదారుల చుట్టూ చెట్లు, బండరాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. తమ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ గ్రామాల్లోకి ఎవరైనా అడుగుపెడితే భారీ జరిమానా వేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: