విశాఖలోని సింహాద్రి ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాక్డౌన్ కష్టాలను చవిచూస్తోంది. మొత్తం రెండు వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ పవర్ ప్లాంట్.. ప్రస్తుతం సగం ఉత్పత్తికి మాత్రమే పరిమితమైంది. మార్చి నెలలో ప్రారంభం తర్వాత విద్యుత్ వినియోగం పరంగా పారిశ్రామిక అవసరాలు తగ్గిపోయాయి. ఈ కారణంగా.. మొదటి యూనిట్ లో ఉత్పత్తి నిలిపేశారు. ఏప్రిల్ 15 నుంచి మొదటి యూనిట్లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ప్రభుత్వాల నుంచి విద్యుత్ డిమాండ్ అభ్యర్థన లేకపోవడం వల్ల 4 రోజులుగా రెండో యూనిట్‌లోనూ తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపేశారు.
రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 4 యూనిట్లు ఉన్నాయి. ఒక్కోటి 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం డిమాండ్ లేని కారణంగా 3, 4 యూనిట్లు మాత్రమే పని చేస్తున్నాయి. 1000 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే సింహాద్రి పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలకు డిమాండ్ అనుగుణంగా జెన్కోలకు సరఫరా అవుతుంది. గ్రిడ్‌కు అనుసంధానం ద్వారా ఈ విద్యుత్ సరఫరా అవుతుంది.
సాధారణంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. పరిశ్రమలు ఇటు వాణిజ్య అవసరాలు పారిశ్రామిక అవసరాలకు ప్రధానంగా శీతలీకరణ యంత్రాలకు విద్యుత్ ఎక్కువగా అవసరం అవుతుంది. ప్రస్తుతం లాక్డౌన్ వలన అన్ని పరిశ్రమలు మూతపడిన కారణంగా.. విద్యుత్ వాడకం పూర్తిగా తగ్గిపోయింది. నాలుగో లాక్ డౌన్లో కొంత వెసులుబాటు లభించనుంది. మళ్లీ తిరిగి కార్యకలాపాలు మొదలైన పరిస్థితులో పరిశ్రమల నుంచి విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా.
ఈ ప్రకారంగా.. డిమాండ్ పెరిగితే క్రమంగా మిగిలిన యూనిట్లలలో ఉత్పత్తి ప్రారంభించాలని ఎన్టీపీసీ సింహాద్రి అధికార వర్గాలు భావిస్తున్నాయి ప్రస్తుతం మాత్రం ప్రణాళిక ప్రకారం సగం ఉత్పత్తి మాత్రమే కొనసాగించనుంది.
ఇదీ చదవండి: