రాష్ట్రంలో పురపోరుకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తైంది. మొదటి రెండు రోజులు పత్రాల సమర్పణ మందకొడిగా సాగినా ఆఖరి రోజున అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా నామపత్రాలు దాఖలు చేశాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల దాఖలు సందడిగా సాగింది. ఊరేగింపుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలివచ్చిన అభ్యర్థులు పత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోనూ భారీ సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు.
విశాఖ నగరపాలక సంస్థలో నామినేషన్ల దాఖలు ఘట్టం కోలాహలంగా సాగింది. 98 డివిజన్‌లకు గాను 1361 పత్రాలు దాఖలయ్యాయి. తెలుగుదేశం తరపున అత్యధికంగా 380, వైకాపా నుంచి 368 పత్రాలు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా పురపాలికల్లోనూ అభ్యర్థులు భారీ ర్యాలీతో తరలివచ్చి నామపత్రాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అధికార, ప్రతిపక్షాలు, స్వతంత్రులు భారీగా నామినేషన్లు సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, కొవ్వూరులో ఆఖరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థలో 50 డివిజన్లకు 462 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చీరాల, కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల పురపాలికలో ఆఖరి రోజున పోటాపోటీగా నామినేషన్లు సమర్పించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నామపత్రాల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
ఇదీ చదవండీ... చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత