విశాఖ జిల్లాలో వరి పంటను అధికంగా పండిస్తారు. జిల్లావ్యాప్తంగా 1.58 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంటే.. 99 వేల హెక్టార్లలో వరి మాత్రమే సాగు చేస్తారు. పెట్టుబడి ఖర్చుతో పోల్చితే..పంట విక్రయించాక వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుందని వ్యవసాయ, ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందులో కుటుంబ సభ్యుల శ్రమని సైతం లెక్కించారు. ప్రకృతి విపత్తులు రైతులను ఏదో విధంగా నష్టపరుస్తునే ఉన్నాయి. వర్షం పడితే తడిసిన ధాన్యం రంగుమారటంతో పంటకు గిట్టుబాటు ధర లభించటం లేదు. వరి సాగులో ఎక్కువ మంది సంప్రదాయ పద్ధతులను అనుసరించటం వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి.
ఒకప్పటితో పోల్చితే విత్తనాలు, కూలీలు, దుక్కు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇలా చాలా వాటికి ధరలు పెరిగిపోయాయి. వరి సాగులో ఖర్చులు తగ్గించాలంటే నాట్ల నుంచి నూర్పు వరకు యాంత్రీకరణ సరైన మార్గమని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందని..రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. పంట ప్రారంభం నుంచి ధాన్యం అమ్ముడయ్యే దాక కష్ట, నష్టాలని అంచనా వేసుకుని వ్యవసాయం చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: 4 నెలలు నట్టేటే...37 లక్షల ఎకరాల్లో పంట నష్టం