శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. దీంతో రోడ్డు ప్రమాదాలూ ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు రవాణాశాఖ తీసుకుంటున్న చర్యలతో పాటు, విశాఖలోని కొందరు న్యాయవాదులు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారు.
హెచ్చరిక సూచికలు లేకపోవడంతో...
పాడేరుకు చెందిన కుంతూరు బాలమురళి కృష్ణప్రసాద్ న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. ప్రమాద హెచ్చరిక సూచికలు లేకపోవడంతో అరకు ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన ఆయన.. తనలాంటి ఔత్సాహిక న్యాయవాదులతో చర్చించి జిల్లాతో పాటు నగరంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లను అంటించాలని నిర్ణయించారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో...
తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, మలుపులను గుర్తించి అక్కడ ఉన్న చెట్లు, స్తంభాలకు రేడియం స్టిక్కర్లు అంటించి వాహన చోదకులను అప్రమత్తం చేస్తున్నారు. అరకు ప్రాంతంలో సుమారు 45 కిలోమీటర్లు, కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు సుమారు 30 కిలోమీటర్లు, పాడేరు రహదారిలో 30 కిలోమీటర్లు, నగరంలోని కొన్ని ముఖ్యమైన కూడళ్లలో రేడియం స్టిక్కర్లు అంటిస్తున్నారీ న్యాయవాదులు.
న్యాయవిద్యార్థులు సైతం...
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల సైకిళ్లకు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లకు ప్రమాదాలు జరగకుండా రేడియం స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈ న్యాయవాదుల బృందం చేస్తున్న ప్రయత్నాన్ని నగర ఏడీసీపీ ఆదినారాయణ అభినందించారు. వీరికి తోడుగా న్యాయ విద్యార్థులు కూడా పాలుపంచుకోవడం విశేషం.
ఇవీచదవండి.