విశాఖ మన్యంలోని గిరిజనులకు ఏ కాలంలో చూసినా ప్రకృతి ఏదో ఫలాన్ని ఇస్తూ... తనతో పాటు పోషిస్తూ ఉంటుంది. మార్చిలో మన్యంలో పూసే ఈ కంచెడి పువ్వు.. ఆ కోవకే చెందుతుంది. చెట్టు అంతా కంచె కంచెగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. చుట్టూ తెల్లని రెమ్మలతో ముదురుగా ఉండి... మధ్యలో గులాబీ చారలతో విరబూసి ఎంతో అందంగా ఉంటుంది ఈ పుష్పం. వీటిని మన్యం వాసులు కూరగా వండుతారు. ప్రత్యేక ఔషధ లక్షణాలు కలిగి ఉన్న కారణంగా.. ఈ కంచెడి పువ్వులకు మన్యంలో గిరాకీ ఎక్కువ.
వనవాసంలో రాముడు తిన్న కూర
మన్యంలో కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి చోట.. కొండ దిగువన ఉండే చెట్లకు ఈ కంచెడి పూలు పూస్తాయి. గిరిజనులు ఎంతో కష్టపడి చెట్టెక్కి ఇష్టంగా వీటిని సేకరిస్తారు. రాముడికి.. వనవాస సమయంలో సీతాదేవి ఈ పూలకూర వండి పెట్టిందని స్థానికుల ప్రగాఢ నమ్మకం.
బుట్ట వెల రూ.200
గిరిజనులు మన్యం సంతల్లో ఈ కంచెడి పూలను సేకరించి అమ్ముతుంటారు. బుట్ట ఖరీదు 200 రూపాయలకు పైగా ఉంటుంది. ఈ కూర గురించి తెలిసిన వారు ఎవరు వీటిని కొనకుండా ఉండలేరు. మైదాన ప్రాంతాలల్లో వండే గుత్తి వంకాయ కూర రుచిని మించి... ఈ పువ్వు కూర ఉంటుందని స్థానికులు చెబుతారు.
ఆసక్తి చూపని గిరిజనులు
ఆరుగాలం కష్టపడే గిరిజనులకు ఎన్నో ఔషధ గుణాలున్న ఇటువంటి కూరలు... వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కూరగాయలు నిత్యం అందుబాటులో ఉన్నందున చాలా మంది గిరిజనులు ఈ చెట్లను పట్టించుకోవడం లేదు. ఇవి కాలానుగుణంగా పండి రాలిపోతున్నాయి. వీటిని ఉపయోగించుకుని ఆరోగ్య పరంగా ముందుకు వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు. విశాఖ మన్యం ప్రాంతాలైన పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, పెదబయలు పరిసర కొండల్లో, అడవుల్లో ఈ పూలు ఎక్కువ లభిస్తాయి.
ఇవీ చదవండి: