Complaint on YSRCP Leader Balineni Srinivasa Reddy: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అండదండలతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో వందల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖలో ఆరోపించారు. బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి అచ్యుతాపురం మండలం చౌడపల్లిలో వేసిన 105 ఎకరాలు లేఅవుట్‌లో అడుగడుగునా అక్రమాలు అన్యాయాలు జరిగాయని మూర్తి యాదవ్ తెలిపారు.
2009వ సంవత్సరంలో 105 ఎకరాల్లో లేఅవుట్ వేసిన భాస్కర్ రెడ్డి.. బాలినేని మంత్రి అయ్యాక చుట్టూ ఉన్న ప్రభుత్వ, అటవీ శాఖ భూములను కబ్జా చేసి 125 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్‌ను నిర్మించారన్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పొలిటికల్ సఫరర్ కోటాలో కునుకు వెంకట రత్నమ్మ, గోపాలం రాజ్యలక్ష్మి కుటుంబీకులకు ప్రభుత్వం కేటాయించిన 8 ఎకరాలను 22 ఏలో నుంచి తప్పించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.
బాలినేని అండతో వియ్యంకుడు భాస్కర్ రెడ్డి లేఅవుట్‌లో.. కబ్జాలు, ఆక్రమణలు, ఉల్లంఘనల కారణంగా ప్రభుత్వానికి 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ లేఅవుట్‌ను ఆనుకొని ఉన్న పది ఎకరాలకు పైగా అటవీ శాఖ భూములను ఆక్రమించారని తెలిపారు. నిబంధనల మేరకు లేఅవుట్‌కు ఆనుకొని అటవీ శాఖ భూములు ఉంటే ఏడు మీటర్లను బఫర్ జోన్‌గా వదిలేయాలి. అయితే అందుకు విరుద్ధంగా బాలినేని బినామీల బృందం మరో 8 మీటర్ల మేర అటవీ శాఖ భూములను ఆక్రమించి ఇందులోనే కాంపౌండ్ వాల్ నిర్మించిందని అన్నారు.
నిర్మించిన సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తుండటం గమనార్హం అని గుర్తు చేశారు. ఆయన సంబంధిత శాఖ మంత్రిగా ఉండటంతో అటవీ శాఖ అధికారులు ఎవరూ లేఅవుట్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని చెప్పారు. అదే విధంగా చెరువులను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా కాంపౌండ్ వాల్‌ను, రహదారిని నిర్మించారు. పక్కనే ఉన్న చెరువును 100 అడుగుల పొడవున కబ్జా చేసి 60 అడుగుల రోడ్డు 40 అడుగుల్లో చెరువుగట్టు నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన, నిబంధనలను ఉల్లంఘించిన ఈ లేఅవుట్లను రద్దు చేయాలని.. అటవీశాఖ, ప్రభుత్వ భూములలో నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను వెంటనే కూల్చి వేయాలన్నారు. చెరువు ఆక్రమణ తొలగించి దానిని పునరుద్ధరించాని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు.
అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, పట్టణ అభివృద్ధి శాఖల అధికారులతో ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేసి ఆక్రమణలు, ఉల్లంఘనలపై విచారణ జరపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయ పోరాటం మినహా మరో మార్గం లేదని అన్నారు.
"బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఎవరో తెలుసా.. ప్రస్తుత ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి బావమరిది. అధికారం ఉంది కదా అని.. అడ్డదారిలో ప్రభుత్వం భూములను కొట్టేసిన విషయం వైబీ సుబ్బారెడ్డికి తెలియదా అని ప్రశ్నిస్తున్నాం. మాజీ మంత్రి బాలినేని బినామీలపై చర్యలు తీసుకొని.. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం". - పీతల మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్, విశాఖ
ఇవీ చదవండి: