pawan kalyan fan revati : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని, విశాఖకు చెందిన చిన్నారి రేవతి గుర్తుందా.. పవన్.. నాలుగేళ్ల కిందట విశాఖలో పర్యటించిన సందర్భంలో ఓ నిరుపేద తల్లి తన చిన్నారిని ఒడిలో పెట్టుకుని దగ్గరకు తీసుకువచ్చింది. మస్క్యులర్ డిస్ట్రోఫీ.. అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న ఆ చిన్నారికి పవన్‌ను చూడాలని కోరిక. ఈ విషయం తెలిసిన పవన్.. బాలికను దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని కాసేపు మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి తెలిసి, స్వయంగా చూసి చలించిపోయారు. ఆమెకు ఆర్థిక సాయం అందించారు. వ్యాధి కారణంగా నరాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ జీవచ్ఛవంలా మారుతున్న ఆ చిన్నారికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కూడా అందించారు.
మస్క్యులర్ డిస్ట్రోఫి వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రేవతి.. కన్నుమూసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. చిన్నారి రేవతి మరణం తీవ్రంగా బాధించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. నాలుగేళ్ల కిందట తాను పోరాట యాత్ర చేస్తున్న సమయంలో విశాఖ నగరంలో తనను కలిసిన రేవతి చనిపోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన రేవతి.. ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో ఉండేదని.. నాలుగేళ్ల కిందట ఆ చిన్నారి కలిసేనాటికి ఏడెనిమిదేళ్ళ వయస్సు ఉంటుందని గుర్తు చేసుకున్నారు.
తనను ఆశ్చర్యపరిచిందంటూ.. అలాంటి ఆరోగ్య స్థితిలో చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ ఆ చిన్నారి చూపిన మానసిక ధైర్యం తనను అబ్బురపరచిందన్నారు. కొన్ని భక్తి గీతాలు కూడా తన ఎదుట పాడి ఆశ్చర్యపరిచిందని... తాను ఆమెకు ఇచ్చిన మూడు చక్రాల బ్యాటరీ సైకిల్‌పై పాఠశాలకు వెళ్లేదని, భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించానని తెలిపారు. వ్యాధి కారణంగా ఆ చిన్నారి 12 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఒక ప్రకటనలో పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తుది శ్వాస విడిచే సమయంలోనూ భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్న వీడియో మనసును కలచి వేసిందని... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. పుట్టినప్పుడే ఆమె ఎక్కువ కాలం బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పినా, 12 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్న రేవతి తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు.
ఇవీ చదవండి :