Inauguration of CM Camp Office on Rushikonda October 19th : సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ నెల 19న విశాఖ వెళ్లనున్నట్లు సమాచారం. అదే రోజున రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో (CM Camp Office At Visakha) పాల్గొననున్నారని తెలిసింది. విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని నిర్ణయించుకున్న సీఎం జగన్... ఈ నెల 19న రుషికొండపై క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారని సమాచారం.
విశాఖలో పరిపాలనకు అనువైన కార్యాలయాలు గుర్తించేందుకు ఇటీవల ముగ్గురు సీనియర్ అధికారులతో కమిటీ వేశారు. ఇప్పటికే సీఎం కార్యాలయంగా ప్రచారంలో ఉన్న రుషికొండ పర్యాటక భవన్‌లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ సీఎం కుటుంబ సభ్యులు 19న వచ్చి పూజాదికాలు నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు అధికార వర్గాలకు సమాచారం అందిందని చెబుతున్నారు. జగన్ ఈ నెల 24న వచ్చి అదే భవనంలో 26 వరకు ఉంటారనీ చెబుతున్నారు. ఈ పర్యటనలు అధికారికంగా ఖరారు కాలేదు.
MP Raghurama Krishnaraju on Illegal Mining of Rushikonda in Visakhapatnam : విశాఖలోని రుషికొండ అక్రమ తవ్వకాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలు, అనుబంధ పిటిషన్‌పై సాధ్యమైనంత త్వరగా ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టు రిజిస్ట్రార్‌కు విజ్ఞప్తి లేఖ రాశారు. ఈ ఏడాది అగస్టు 2న హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయాన్ని వాయిదా చేసిందని పేర్కొన్నారు. న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని అన్నారు.
ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రుషికొండ ప్రాంగణానికి తరలిస్తున్నట్లు ఆంగ్ల, స్థానిక పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం జరిగితే, వ్యాజ్యాలు దాఖలు చేసిన ఉద్దేశం నిష్ఫలం అవుతుందని పేర్కొన్నారు. ఆ వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయని అన్నారు. అక్టోబర్ 21 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయని.. ఈ నేపథ్యంలో న్యాయస్థానం నిర్ణయాన్ని వెల్లడించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు కోరారు.
Minister Botsa Satyanarayana on Chief Minister Residence in Visakhapatnam : ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష కోసమే విశాఖలో సీఎం జగన్ నివాసం, ప్రభుత్వ శాఖాధికారుల నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని తన సోదరుని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు బొత్స సత్యనారాయణ సమాధానం ఇస్తూ, విశాఖలో ముఖ్యమంత్రి నివాసం, ఆయన కార్యాలయ సిబ్బంది ఆవాసల ఏర్పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష కోసమేనని తెలిపారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు రాయలసీమ, కోస్తాంధ్రాలో ఎలాగు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయని అన్నారు. అదే తరహాలో ఉత్తరాంధ్రలోనూ ఉండాలన్న ఉద్దేశ్యంతోనే విశాఖలో తగిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.