విశాఖలో ఆక్రమణల్ని కొనసాగనివ్వం. భూముల కబ్జాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్న మాటలివి. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో భీమిలి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో భూముల్ని కాపాడుకోవడం అధికారులకు ఓ సవాలుగా మారింది. ఇప్పటికే సిట్ విచారణలో వేలాది ఎకరాలకు సంబంధించిన భూ వివాదాలు నలుగుతున్నాయి. సర్వే నెంబర్లు, రికార్డులు, పట్టాలు ఏది నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో చారిత్రక, భౌగోళిక వారసత్వ సంపదలుగా ఉన్న ప్రదేశాలను ప్రభుత్వం ఏ మేర పరిరక్షిస్తుంది. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపడుతుందనే విషయాలపై చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ సుందర నగరంగానే కాదు చారిత్రక అంశాల పరంగాను ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా సాగర తీరంలోని ఎర్రమట్టి దిబ్బలు, తొట్ల కొండ, బావి కొండ, పావురాల కొండ వంటి విశిష్టతలు ఈ ప్రాంత ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తాయి. ఎర్ర మట్టి దిబ్బలకు జాతీయ భౌగోళిక వారసత్వ సంపదగా జీఎస్ఐ గుర్తింపు ఉంది. ఇక బౌద్ధ క్షేత్రాలుగా ఉన్న కొండలు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఇప్పుడు వీటి పరిధిలో ఉన్న భూముల సంరక్షణ అంశం చర్చకు దారి తీస్తోంది.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రదేశాల్లో భూములను కాపాడుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. విశాఖ నగరానికి విశిష్టత కలిగించడంలో కీలకమైన ఈ తరహా వారసత్వ ప్రదేశాల ఖ్యాతిని సంరక్షించే దిశగా పటిష్టమైన విధానాలను అవలంబించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదీ చదవండి: దర్శకుడు కె.విశ్వనాథ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి