హైందవ ధర్మంలో దేవాలయాలు... సంస్కార కేంద్రాల మాదిరిగా పని చేస్తాయని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. హిందువులంతా పూజలకే పరిమితం కాకుండా ఆలయాల అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర శనివారం సోంపేట, టెక్కలి ప్రాంతాల్లో కొనసాగింది. సోంపేటలో నింభాషిణి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం సోమ పోలమాంబ ఆలయానికి వెళ్ళారు. గురువులు స్వరూపానందేంద్ర చేతుల మీదుగా అమ్మవారి ఆలయ ప్రతిష్ట జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సోమ పోలమాంబ, మహాకాళి, మహాదుర్గ అమ్మవార్లు కొలువుదీరిన ఈ ఆలయం నేడు త్రిశక్తి పీఠంగా అలరారుతుండటం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. స్కంద మాత కొలువుదీరిన ఆలయం సోంపేటలో ఉండటం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమేనని అన్నారు. అనంతరం ఉమామహేశ్వర సోమేశ్వర స్వామి ఆలయాన్ని స్వామీజీ సందర్శించారు. సోమ పోలమాంబ, సోమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులను ఉద్దేశించి స్వాత్మానందేంద్ర స్వామి అనుగ్రహ భాషణం ఇచ్చారు. సోంపేట పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మీకత చైతన్యానికి మూల కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని ప్రశంసించారు.
ఇదీ చదవండి: