High Court on Rushikonda Illegal Mining: విశాఖలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, అనుమతులకు మించి జరిపిన నిర్మాణాలపై చర్యలు తీసుకునే వ్యవహారాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు అప్పగిస్తామంటే అభ్యంతరం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అనుమతి ఇచ్చింది ఎంవోఈఎఫ్ కాబట్టి.. ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకునే విషయాన్ని అక్కడికే పంపడం సబబు అని అభిప్రాయపడింది. అనుమతులకు లోబడి నిర్మాణాలు జరిపేందుకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఎంవోఈఎఫ్‌కు అప్పగించే విషయంపై అభిప్రాయం తెలపాలని, నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖలోని రుషికొండను టూరిజం రిసార్టు అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తు, పరిధికి మించి నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి తన వాదనలు వినాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్)కు విరుద్ధంగా, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నిబంధనలు తుంగలో తొక్కి పరిధికి మించి తవ్వకాలను జరుపుతున్నారని ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఎంవోఈఎఫ్ సంయుక్త కమిటీ కూడా.. రుషికొండ తవ్వకాలు, నిర్మాణాల్లో ఉల్లంఘనలు నిజమేనని నివేదిక ఇచ్చింది. 9.88 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతిసుకొని 17.96 ఎకరాల్లో పనులు చేస్తున్నారని గతంలోనే తెలిపింది. ఈ వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి.
జనసేన నేత మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. అనుమతులకు మించి నిర్మాణాలు జరిపారని ఎంవోఈఎఫ్ స్పష్టం చేసిన నేపథ్యంలో రుషికొండపై ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలను నిలువరించాలని కోరారు. ఈ మేరకు అనుబంధ పిటిషన్ వేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తగిన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని ఎంవోఈఎఫ్‌కు పంపుదామని ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పందిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు నియమించిన ఎంవోఈఎఫ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఎంవోఈఎఫ్‌కు పంపాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత వ్యాజ్యాలను పిటిషనర్లు ఉపసంహరించుకునే పనైతే ఎంవోఈఎఫ్‌కు పంపొచ్చన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.