కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ.. ప్రహరీని కూల్చేసిన ఘటనపై విశాఖ జిల్లా గాజువాక తహసీల్దారు ఎంవీఎస్ లోకేశ్వరరావుపై హైకోర్టు మండిపడింది. కోర్టుధిక్కరణ కింద ఆయనకు 6నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా సొమ్ము చెల్లించకపోతే తీర్పు ప్రతిని కలెక్టర్‌కు పంపి ఏపీ రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. పిటిషనర్ల భూమిలో జోక్యం చేసుకోవద్దని, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించొద్దని 2014 మార్చి 21న ఇచ్చిన కోర్టు ఉత్తర్వులకు తహసీల్దారు కొత్త భాష్యం చెబుతూ 2021 జూన్ 13న ప్రహరీ కూలగొట్టారని న్యాయస్థానం నిర్ధారించింది. తహసీల్దారు వ్యవహార శైలి చట్టబద్ధ పాలనకు అవరోధమే కాకుండా.. న్యాయవ్యవస్థ, న్యాయపాలనకు తీవ్ర నష్టం చేస్తుందని వ్యాఖ్యానించింది. ఇలాంటివారిపై కనికరం చూపితే న్యాయవ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
నేపథ్యమిదే.. విశాఖ జిల్లా గాజువాక మండలం తుంగ్లాం గ్రామం సర్వే నంబరు 29/1లోని తమ 5.42 ఎకరాల భూమి నుంచి తమను ఖాళీ చేయించేందుకు అధికారులు యత్నిస్తున్నారంటూ విశాఖపట్నానికి చెందిన పి.అజయ్‌కుమార్, పి.సునీతదేవి 2014లో హైకోర్టును ఆశ్రయించారు. వారిని నిలువరించాలని కోరారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని 2014 మార్చి 21న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
కానీ, 2021 జూన్ 13న తహసీల్దారు సమక్షంలో అధికారులు పొక్లెయిన్లతో పిటిషనర్లు నిర్మించిన ప్రహరీలో కొంతభాగాన్ని కూల్చేశారు. దీంతో అజయ్‌కుమార్, సునీతదేవి 2021 జూన్ 17న అధికారులపై కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలుచేశారు. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎన్.సుబ్బారావు వాదనలు వినిపించారు. గాజువాక తహసీల్దారు అఫిడవిట్ దాఖలు చేస్తూ.. అనధికారికంగా నిర్మించిన ప్రహరీని కూల్చామన్నారు. 5.42 ఎకరాలపై యాజమాన్య హక్కును పిటిషనర్లు కోరలేరన్నారు. ఆ భూమి మొదట విశాఖ స్టీలు ప్లాంటుకు, తర్వాత రైల్వేశాఖకు బదిలీ చేశారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్లు భూమిని ఆక్రమించారనే కారణం చూపుతూ ప్రహరీ కూల్చామని తహసీల్దారు ఒప్పుకొంటున్నారని గుర్తుచేశారు. ఆ భూమిని పిటిషనర్లు ఆక్రమించారని అధికారులు భావిస్తే.. ఏపీ భూఆక్రమణ(నిరోధక) చట్టంలోని నిబంధనలను అనుసరించి వారిని ఖాళీ చేయించాలన్నారు. అలాకాకుండా ఉద్దేశపూర్వకంగా గోడను కూల్చారన్నారు. ఈ చర్య కోర్టుధిక్కరణ కిందికి వస్తుందని స్పష్టం చేశారు. ఇతర ప్రతివాదులకు కోర్టుధిక్కరణ వర్తించదన్నారు.
ఇదీ చదవండి: కోర్టు సముదాయంలో చోరీ.. కేసు ఆధారాలు అపహరణ!