విశాఖ నగరంలో 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం సాయంత్రం వరకు తెరవాలని జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆమె జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. నగరంలో కొత్త పీహెచ్‌సీలు ప్రారంభించాలని గత ఏడాది ఆదేశించినా, ఇప్పటి వరకు జోనల్ కమిషనర్లు చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జీవీఎంసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో 71 ఆరోగ్య కేంద్రాల వివరాల లింకును జత చేయడంపై ‘ఈనాడు’లో ‘ 71 ఆరోగ్య కేంద్రాలెక్కడున్నాయ్...!’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనికి కమిషనర్ స్పందించారు. మంగళవారం సాయంత్రానికల్లా జీవీఎంసీకి చెందిన పాఠశాలలు, సామాజిక భవనాలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తక్షణమే ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. వైద్యులను ఇంకా నియమించలేదని జెడ్సీలు తెలపగా... ఏఎన్‌ఎంలతోనైనా ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి…: ప్రారంభం కాని రబీ కొనుగోళ్లు... ఆందోళనలో రైతులు