Industries Minister Gudivada Amarnath: 2022 ఆగస్టులో విడుదల చేయాల్సిన ఎంఎస్ఎంఈ రాయితీల్ని.. 2023 మార్చిలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా ఫిబ్రవరిలో ఇవ్వాలనుకుంటే ఎన్నికల కోడ్ అడ్డొచ్చిందని కథలు చెప్పారు కదా అమర్‌నాథ్ గారూ..? మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసినా రాయితీల ఊసే లేదెందుకు..? ప్రభుత్వం ఇప్పటికైనా రాయితీ మొత్తాన్ని విడుదల చేస్తుందా, లేక మళ్లీ వాయిదా వేస్తుందా..? ఇవీ... పరిశ్రమల యజమానులు అడుగుతున్న ప్రశ్నలు.
ప్రభుత్వానికి ఇంకా కోడ్ ముగిసినట్టు లేదు.. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు విడుదల చేయకపోవడంతో ఎంఎస్ఎంఈ పడుతున్న ఇబ్బందులపై.. పారిశ్రామిక రాయితీ జాడేది అంటూ ఫిబ్రవరిలో ఈనాడు కథనం ప్రచురించింది. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌కు ఉక్రోషం వచ్చేసింది. ఫిబ్రవరి 25న విశాఖలో మీడియా సమావేశం నిర్వహించి ఏవేవో కథలు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే రాయితీ సొమ్ము విడుదల చేస్తామన్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘ఫ్యాక్ట్‌చెక్’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనాడు కథనం ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఉందని వాపోయింది. ఎన్నికల కోడ్ ముగియగానే రాయితీలు విడుదల చేస్తామని చెప్పింది. ఎన్నికలు ముగిసి చాలా రోజులవుతున్నా ఇప్పటికీ ఆ ధ్యాసే లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 9 నుంచి అమల్లోకి వచ్చిన కోడ్ .. మార్చి 19తో ముగిసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మార్చి 23తో పూర్తయింది. కానీ ప్రభుత్వానికి ఇంకా కోడ్ ముగిసినట్టు లేదు. ఇప్పటి వరకూ పారిశ్రామిక రాయితీలు విడుదల చేయలేదు. అయినా ఎన్నికల కోడ్ ఉందంటూ పరిశ్రమల శాఖ మంత్రి ఏదో సాకు చెప్పారే తప్ప.. వాస్తవానికి రాయితీలకు, కోడ్‌కి సంబంధమే లేదు. అది ప్రతి సంవత్సరం జరగాల్సిన ప్రక్రియ. అదే నిజమైతే.. కోడ్ అమల్లో ఉన్నప్పుడే కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారులకు నిధులు ఎలా విడుదల చేశారు..? పరిశ్రమలకు రాయితీల విడుదలకు కోడ్ అడ్డంకి అనుకున్నా.. ఎన్నికల సంఘం నుంచి ముందే అనుమతి తీసుకుని ఉండొచ్చు కదా..? ఇవీ.. పరిశ్రమల యజమానులు అడుగుతున్న ప్రశ్నలు.
బడ్జెట్ కేటాయింపులకే పరిమితం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీగా 726 కోట్లు చెల్లించాలని పరిశ్రమల శాఖ లెక్కగట్టింది. గతంలో ఇచ్చినట్లు అందరికీ ఒకటే జాబితా కాకుండా.. జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా వర్గీకరించి వేర్వేరు జాబితాలు రూపొందించింది. పారిశ్రామిక రాయితీలకు బడ్జెట్‌లో కేటాయింపులు చూపిస్తున్నా సకాలంలో చెల్లించడం లేదు. కొవిడ్ లాక్‌డౌన్ వల్ల 2020 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ సమయంలో ఎంఎస్ఎంఈలు చెల్లించాల్సిన విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ ఛార్జీలు 188 కోట్లకు, భారీ పరిశ్రమలు చెల్లించాల్సిన 17 కోట్లకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ మొత్తాన్ని డిస్కంలు విద్యుత్తు బిల్లుల్లో కలిపి పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేశాయి. ఇప్పటికీ ఆ మొత్తాన్ని పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తిరిగి చెల్లించలేదు.
ఇవీ చదవండి: