గంటా శ్రీనివాసరావు.....ఎన్నికల్లో ఆయన పోటీ చాలా ప్రత్యేకమైనది. అంతేకాదు విచిత్రంగానూ ఉంటుంది. పోటీ చేసే స్థానంలో పోటీ చేయకుండా...పోటీ పడిన స్థానంలో వరుసగా బరిలో నిలవకుండా...అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తారు. ప్రతి ఎన్నికలలో సరికొత్త బాణితో ఓట్ల సమరంలోకి దిగటం గంటా విలక్షణం. పార్టీ ఏదైనా, జెండా ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే.. పోటీలో నిలిచరంటే చాలు... విజయాన్ని లాగేసుకునే గంటా రాజకీయం గమ్మత్తుగానే ఉంటుంది.
ఎంపీగా ప్రస్థానం...
స్వస్థలం ప్రకాశం జిల్లా.... విద్యాభసం మొదలు వ్యాపారం వరకు విశాఖనే కేంద్రం. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే గంటా... మాట నెగ్గించుకోవటంలోనూ దిట్టే. ఎన్ని అవరోధాలు ఎదురొచ్చిన పోటీ చేసిన ప్రతిసారి విజయబావుటా ఎగరవేయటం ఆయన నైజం. తొలిసారిగా 1999లో అనకాపల్లి తెదేపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయఢంకా మోగించారు. 2004లో చొడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో అనకాపల్లి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ విలీనంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో సైకిల్ గుర్తుపై భీమిలి నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టారు.
స్థానం ఏదైనా గెలుపే..!
మారుతన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని అనకూలంగా మార్చుకోవడం...ఎదురయ్యే సమస్యలు పరిష్కరించి ఆకట్టుకోవడం గంటా స్టైల్ రాజకీయం. గంటా ఈసారీ భీమిలి వదిలి విశాఖ ఉత్తరం బాట పట్టారు. ఇప్పుడు అక్కడా గెలిచి... సరికొత్త రికార్డు సృష్టించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్న చుట్టేసి... ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అందుకే అంటారు విజయం ఊరికే రాదు... కష్టపడి సాధించుకోవాలని. ఆ జాబితాలో ఉండే గంటా శ్రీనివాసరావు.... పార్టీలకు ఓ బహుమతని రాజకీయం వర్గాల విశ్లేషిస్తుంటాయి.