విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (తెదేపా) రాజీనామా చేశారు. స్వయంగా రాసిన లేఖను శనివారం ఉదయం స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం విలేకర్లతో తన రాజీనామాకు కారణాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘నిరసన ప్రజా ఉద్యమంగా మారనున్న నేపథ్యంలో రాజకీయాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా పదవులు వదులుకొని అందరూ ముందుకొస్తే నిర్ణయం తీసుకునే వ్యక్తులపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. నా నిర్ణయానికి అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని ప్రశంసిస్తున్నారు. నా వెంట ఉంటామంటున్నారు.
ప్రజల గుండెచప్పుడు
విశాఖ ఉక్కు కర్మాగారంతో వేలమంది ఉద్యోగులకు, వివిధ వర్గాలకు చెందిన లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా విడదీయలేని బంధం ఉంది. దీన్ని తెలుగు ప్రజల గుండెచప్పుడుగా భావిస్తున్నారు. అలాంటి కర్మాగారాన్ని నష్టాల పేరుతో ప్రైవేటీకరించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మనిషి శరీరం నుంచి తలను వేరుచేసిన భావన కలుగుతోంది. సంస్థకు నష్టం వస్తే తీవ్రంగా దృష్టిపెట్టి దాన్ని పరిష్కరించాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రధాని వాజపేయీని కలిసి పరిశ్రమ ప్రాధాన్యం వివరించడంతో రూ.1000 కోట్లు సాయం చేశారు. ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేకపోవడమే నష్టాలకు కారణం. గనులు కేటాయిస్తే టన్నుకు రూ.5 వేల భారం తగ్గుతుంది. అలాంటి చర్యలు తీసుకోవాలి తప్ప ప్రైవేటీకరణ సరికాదు. విశాఖలోనే పెరిగి, ఇక్కడే ఎదిగిన వ్యక్తిగా నాపై బాధ్యత ఉందని భావించాను. నాడు ఎందరో ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని... ఇప్పుడు పదవులను త్యాగం చేసైనా కాపాడుకోవాలి.
భవిష్యత్తు కార్యాచరణకు రాజకీయేతర ఐకాస
భవిష్యత్తు కార్యాచరణకు అన్ని పార్టీలను కలుపుకొని రాజకీయేతర ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస)గా ఏర్పడి ముందుకు వెళ్తాం. ఉద్యమాన్ని దశలవారీగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం. సీఎం జగన్ అన్ని పార్టీల నాయకులనూ దిల్లీ తీసుకువెళ్లి కర్మాగారం ప్రాధాన్యం వివరించి కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలి. ఇప్పటికే రైల్వేజోన్ రాలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. దీన్నయినా పరిరక్షించుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం. పదవుల కన్నా ప్రజల మనోభావాలు ముఖ్యం’ అని గంటా పేర్కొన్నారు.
రాజీనామాపై రెండో ఆలోచన లేదు
రాజీనామాను సరైన విధానంలో పంపలేదని విలేకరులు ప్రశ్నించగా... ‘రాజీనామా విషయంలో రెండో ఆలోచన లేదు. దాన్ని ఆమోదించకుంటే తగిన విధానంలో పంపుతా. ఈ విషయం పార్టీ నాయకత్వానికి చెప్పలేదు. విశాఖలోని అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలూ రాజీనామా చేస్తే తప్పకుండా కదలిక వస్తుంది. ప్రైవేటీకరణ ఆగిపోతే అంతకన్నా సంతోషం మరొకటి లేదు’ అన్నారు. తెదేపాకు రాజీనామా చేస్తారనే ఊహాగానాల్లో భాగంగా చేసిన రాజీనామాగా దీన్ని భావించవచ్చా అని విలేకర్లు ప్రశ్నించగా ‘అలాంటి ఉద్దేశాలు లేవు. కేవలం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపాలనే ఉద్దేశంతోనే చేశా’ అని వివరించారు.
ఇదీ చదవండి: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు