వైద్యుని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేట్టుగా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తొందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. విశాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను తెదేపా బృందం పరామర్శించింది. డాక్టర్ సుధాకర్‌కి న్యాయం చేయాలని అన్ని స్థాయిల్లోనూ విజ్ఞప్తి చేశామని, అటు రాష్ట్రపతి, ప్రధాని, జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కి ఫిర్యాదు చేశామన్నారు.
వైద్యుడిని అంత దారుణంగా కొట్టిన పోలీసులపై ఎస్టీ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పీపీఈ కిట్లు కోసం ప్రశ్నించిన వైద్యుడిని హింసించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహిస్తున్న అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నర్సీపట్నంలో అత్యధిక డెలివరీ కేసులు విజయవంతంగా అయ్యాయంటే మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్ పాత్రే అని గుర్తుచేశారు. అటువంటి మంచి వైద్యుడిని పిచ్చివాడని ముద్ర వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని చెప్పారు. వైద్య సంఘాలు అండగా నిలబడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
ఇదీచూడండి. సింహాచలంలో పామును పట్టుకున్న అర్చక స్వామి