విశాఖపట్నంకు చెందిన పంచ గ్రామాల భూ సమస్య ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున సమస్య పరిష్కారానికి న్యాయ నిపుణులతో సూచనలు, సలహాలు తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పంచగ్రామాల భూ సమస్య పరిష్కార సలహా కమిటీ చైర్మన్, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన సలహా కమిటీ మొదటి సమావేశం ఆయన అధ్యక్షతన జరిగ్గా... సమస్య పరిష్కారానికి వివిధ మార్గాలను తాము చర్చించి తదుపరి న్యాయ నిపుణుల సలహా, సూచనలు తీసుకోవటం జరుగుతుందన్నారు. అనంతరం నివేదికను ప్రభుత్వానికి నివేదించటం ద్వారా ప్రభుత్వ నిర్ణయంతో ఎవరికి నష్టం లేకుండా... ప్రజలకు, సింహాచల దేవస్థానానికి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే ఆదిరాజు, స్పెషల్ చీప్ సెక్రటరీ మన్మోహన్ సింగ్, ఎండోమెంట్ కమిషనర్ పద్మజ, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, డిప్యూటీ సెక్రటరీ సూర్య నారాయణ, సింహాచలం దేవస్థానం ఈవో మరియు సలహా కమిటీ కన్వీనర్ రామ చంద్ర మోహన్ తదితరులు ఈ సమావేశనికి హాజరయ్యారు.
ఇదీ చూడండీ:రేపు గవర్నర్తో సీఎం జగన్ భేటీ