ఏవోబీలో(AOB) మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. బౌడా-కందమాల్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు(firing) కొనసాగాయి. మావోయిస్టులు కదలికలపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు.. ఒడిశాకు చెందిన భద్రతా బలగాలు శుక్రవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి.
బౌడా-కందమాల్ సరిహద్దులో గొచ్చపడా పోలీసుస్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు జరుపుతున్న ఎస్‌వోజీ పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువైపులా కాల్పులు (firing) జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ సమీప అటవీప్రాంతం నుంచి తప్పించుకున్నారు. గాయపడ్డ జవాన్లను సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సహకారంతో రహదారి మార్గానికి తీసుకువచ్చి అక్కడినుంచి ఆసుపత్రికి తరలించారు.
మల్కన్‌గిరి-కోరాపుట్ పర్యటనలో ఉన్న ఒడిశా డీజీపీ, డీజీ ఇంటెలిజెన్స్, ఐజీలు తమ పర్యటన రద్దు చేసుకుని బౌధా జిల్లాకు చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్ తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని ఒడిశా పోలీసువర్గాలు తెలిపాయి.
గత నెలలోనే.. విశాఖ(vishaka) జిల్లా కొయ్యూరు మండలం మంప పీఎస్ పరిధిలో ఎదురుకాల్పులు జరిగాయి. తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. డీసీఎం కమాండర్ సందె గంగయ్యలాంటి కీలక మావోయిస్టు నేత ఈ కాల్పుల్లో మరణించారు. అయితే తాజాగా మళ్లీ ఏవోబీలో తుపాకీ చప్పుడు వినిపించడం కలకలం సృష్టిస్తోంది.
ఇదీ చదవండి: kollu arrest: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. కొల్లు రవీంద్ర అరెస్ట్!