గ్రామసభ నిర్వహించకముందే అంగీకార పత్రాలు ఎలా తీసుకున్నారంటూ... విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ ప్రాంతంలో భూసమీకరణ కింద 153.11 ఎకరాలు సేకరించేందుకు గ్రామసభ నిర్వహించిన అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు, తహసీల్దార్ ప్రసాదరావు... 161 మంది రైతుల్లో 130 మంది అంగీకార పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. అధికారుల తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టా భూముల్లోని ఫలసాయం డబ్బుల కోసమంటూ సంతకాలు తీసుకొని... అంగీకార పత్రాలు అంటున్నారని రైతులు ఆరోపించారు.
భూసేకరణ చట్టం ప్రకారం తప్ప ప్రభుత్వం కోరిన విధంగా భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని... విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం వాసులు స్పష్టం చేశారు. బాధిత రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన మాజీఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ... వారి తరపున న్యాయపోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి వీలైతే పట్టాలిప్పించాలి తప్ప... లాక్కొనే ప్రయత్నం సరికాదని విశాఖ జిల్లా పద్మనాభం మండలం నరసాపురంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ జీవనాధారమైన భూమిని దూరం చేస్తే బతికేదెలాగని... భూసేకరణ ప్రత్యేక ఉపకలెక్టర్ ఎన్వీ సూర్యకళ ఆధ్వర్యంలో జరిగిన సభలో రైతులు ప్రశ్నించారు. 20-30 సెంట్లు, అరెకరం చొప్పున ఉన్న కొద్దిపాటి పొలాలపైనే పిల్లల జీవితాలూ ఆధారపడి ఉన్నాయన్నారు. భూములు ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నట్లుగా ఫారం-2 దరఖాస్తులు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పద్మనాభం మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని వామపక్షాలు హెచ్చరించాయి. అనకాపల్లి మండలంలో మరో 2 గ్రామసభలతో భూసమీకరణ పర్వం ముగియనుంది.
ఇదీ చదవండీ... 'ఆ పిటిషన్‌ను ఎందుకు మూసివేయాలో చెప్పండి..?'