All party leaders meeting in Visakhapatnam: ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పొగొట్టేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించేందుకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో అఖిలపక్ష నేతలు చర్చా వేదికలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం ప్రగతి బాట పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు, ఉద్యోగాలు అవసరమని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. అభివృద్ధిని గాలికొదిలేసి.. అధికార పార్టీ నేతలు సహజ వనరుల్ని కొల్లగొడుతున్నారన్న టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు.. ఉత్తరాంధ్ర కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు.
విశాఖలో ఐటీ, పెట్టుబడి సదస్సులు పెడుతున్నా... స్థానిక యువతకు మాత్రం ఎలాంటి ఉపాధి లభించడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా జనసేన పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయకపోవడం అన్యాయమని లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. ఏళ్లు గడుస్తున్నా పోలవరం పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరాంద్ర ప్రజల మేలుకోసం కాంగ్రెస్ పనిచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. అధికార నేతల భూ కబ్జాలు, బెదిరింపులతో పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. ఈ ప్రాంతం రూపు రేఖలు మారాలంటే.. పోలవరం సహా ఇతర నీటి పారుదల ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఉత్తరాంధ్ర చర్చా వేదికలో నేతలు ప్రస్తావించిన అంశాలపై ఒక నివేదిక రూపొందించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు.
ఈ వెనుకబాటుతనం పారద్రోలాలి అంటే.. నిధులు కావాలి, నీళ్లు సద్వినియోగపడాలి, ఉద్యోగావకాశాలు కావాలి. నార్త్ రాష్ట్రాలలో వెనకబడిన ప్రాంతాలకంటే ఈ ప్రాంతం ఇంకా వెనుకబడింది. అందుకే వెనకబడిన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ప్రతి పార్టీని, ప్రభుత్వాలను కోరుతున్నాను.-మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ
ఇవీ చదవండి