Drugs in Andhra Pradesh : మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని రాష్ట్రంలోని కొందరు బాలలు అల్లాడుతున్నారు. ఓపియం, హెరాయిన్, గంజాయి వంటి వాటికి వారు బానిసలవుతుండటం కలవరం రేపుతోంది. వీటిలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 12వ స్థానంలో ఉండగా.. బాలల్లో ఓపియడ్స్‌కు సంబంధించిన మాదక ద్రవ్యాల వినియోగంలో 10వ స్థానంలో ఉంది. సెడెటివ్స్ వినియోగంలో 8వ స్థానంలో ఉంది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం తాజాగా పార్లమెంట్లో నివేదిక సమర్పించింది.
దేశంలో మత్తు పదార్థాల బారిన పడి తీవ్రంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ఈ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా బాలల్లో వీటి వినియోగం ఇక్కడ ఎక్కువగా ఉందని పేర్కొంది. మాదకద్రవ్యాల మైకం రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా కమ్మేసిందో చెప్పటానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు. దీనివల్ల నేరాలూ పెరుగుతున్నాయి. ముప్పు ఇంత స్థాయిలో ఉన్నా సరే జగన్ ప్రభుత్వం నుంచి మాత్రం దాని నియంత్రణకు అవసరమైన కార్యాచరణ కొరవడింది.
మత్తు ఉచ్చులో విద్యార్థులు...కిక్కు కోసం బానిసలు..
AP Currently Ranks in Drugs Use : రాష్ట్రంలో గంజాయికి బానిసలుగా మారిన వారు 4.64 లక్షల మంది ఉన్నారు. వారిలో 21 వేల మంది బాలలే. వీరిలో 10 నుంచి 17 ఏళ్ల లోపు వారు గంజాయి రుచిచూస్తున్నారు. మొత్తంగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న 20.19 లక్షల మందిలో 22.98 శాతం మంది గంజాయి తీసుకుంటున్నారు. 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 3.17 లక్షల మంది మాదకద్రవ్యాలకు అలవాటుపడగా.. వారిలో 21 వేల మంది గంజాయి సేవిస్తున్న వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 18 నుంచి 75 ఏళ్ల లోపు వారిలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 11వ స్థానంలో ఉంది.
గతంలో మన రాష్ట్రంలో గంజాయి సాగు మాత్రమే ఉండేది. గత నాలుగేళ్లలో దాని లభ్యత, వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడికక్కడే లభిస్తోంది. విక్రయదారులు, సరఫరాదారులు ఎవరో తెలిసినా వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవట్లేదు. ఈ ఉదాసీనత ఫలితంగా దానికి అడ్డుకట్ట పడట్లేదు. ఓపియెడ్స్, ఇన్‌హెలెంట్స్, సెడిటివ్స్‌కు సంబంధించిన మాదకద్రవ్యాల వినియోగం కూడా ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా 9.88 లక్షల మంది ఓపియెడ్స్‌కు బానిసలుగా మారారు.
రాష్ట్రంలో గంజాయి ఫుల్..చర్యలు నిల్
Children Under the Influence of Drugs : మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ కార్యక్రమం అమలు చేస్తోంది. దీని కింద ఏపీలో 2018-19లో 1,752 మంది లబ్ధి పొందగా.. 2020-21 నాటికి వారి సంఖ్య ఏకంగా 8,878కు పెరిగింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో 292.57 శాతం మంది లబ్ధిదారులు పెరిగారు. 2019-20తో పోలిస్తే 2020-21లో ఏకంగా 233.39 శాతం మంది లబ్ధిదారులు పెరిగారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి బారిన పడుతున్న వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
GANJA: గంజాయి ఊబిలో యువత.. జీవితాలు నాశనం
Report for Narcotics Control Bureau : దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో మాదకద్రవ్యాల వినియోగం, ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సహకారంతో కేంద్రం గుర్తించింది. ఆ జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. వీటిలో విశాఖ మన్యం గంజాయి సాగు సరఫరాకు కేంద్రంగా ఉంది. మిగతా జిల్లాలు మీదుగా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. రాష్ట్రంలో మద్యం వినియోగం చాలా తీవ్రంగా ఉంది. మద్యానికి అలవాటు పడి బానిసలైన వారు ఎక్కువమంది ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఏడో స్థానంలో ఉంది. 3.86 కోట్ల మందితో ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. 65.09 లక్షల మందితో ఏపీ ఏడో స్థానంలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో మద్యానికి అలవాటుపడ్డవారు ఏపీ కంటే తక్కువగానే ఉన్నారు. అక్కడ 50.40 లక్షల మంది ఉన్నారు.