విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కథ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఓఎస్డీ నియమాకం, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం సమగ్ర పథక నివేదిక(డీపీఆర్), బడ్జెట్లో కేవలం మూడు కోట్ల రూపాయలను రాయగఢ్ డివిజన్‌తో కలిపి మాత్రమే చూపడం నత్తనడకనే సాగాయి. ఇప్పుడు తాజాగా రైల్వేలో చోటు చేసుకుంటున్న మార్పులు.... ఇకపై జోన్లకు ప్రాధాన్యం ఉంటుందా అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
2015లో వివేక్ దేబ్రాయ్ కమిటీ ఇచ్చిన నివేదిక అధారంగా రైల్వేల్లో జరుగుతున్న సంస్కరణల పర్వంలో జోన్ల కుదింపు అంశం కూడా ఉంది. జోన్లు, డివిజన్లు తగ్గింపుపై కసరత్తు చేస్తున్నట్లు రైల్వే మంత్రి పియూష్ గోయెల్ ఇటీవల పార్లమెంట్లో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇవ్వటంతో ఉత్తరాంధ్ర వాసుల్లో ఆందోళన నెలకొంది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్... ఉత్తరాంధ్రప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తీపి కబురే. 2019 మార్చి 8వ తేదీన కేంద్రం హఠాత్తుగా జోన్ ప్రకటన చేసింది. మరో 11నెలల్లో జోన్ పూర్తి స్థాయిలో పని చేస్తున్నందని వెల్లడించింది. ప్రకటన వరకు బాగానే ఉన్నప్పటికీ అతర్వాత ఆ దిశగా చురుగ్గా అడుగులు ముందుకు పడలేదు. ఇప్పుడు అసలు రైల్వే జోన్ వెంటనే వస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జోన్ ఏర్పాటుపై ఉత్తరాంధ్ర వాసులు చాలా ఆశలే పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని భావించారు. జోన్ ఏర్పాటు వల్ల ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ కేంద్రాలు కూడా రావాలి. అయితే అసలు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఎప్పుడు పూర్తవుతుందన్నది మాత్రం ప్రస్తుతం సమాధానం లేని ప్రశ్నగా మారింది.