సురక్షిత ప్రయాణానికి ఇప్పుడు ప్రయాణికులు ఆర్టీసీ వైపే మెుగ్గు చూపుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ముందస్తు రిజర్వేషన్ చేసుకొని... ప్రయాణం చేయటానికి అన్ని విధాల అనుకూలంగా ఉండటంతో ప్రయాణికులు బస్సు ప్రయాణానికే ఓటేస్తున్నారు.
మండుతున్న ఎండలకు అనుగుణంగా... ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు ఆర్టీసీ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతుండటంతో... ఏసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. విశాఖ నుంచి కడప, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ ప్రాంతాలకు ఏసీ బస్సులను అందుబాటులో ఉంచారు. పరిమిత ఉష్ణోగ్రతతో ఈ బస్సులను నడుపుతున్నారు.
ఈ బస్సుల వలన విశాఖ ఆర్టీసీకి... రోజుకు 3 నుంచి 4 లక్షల ఆదాయం వస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు ఏసీ బస్సుల ప్రయాణానికే ఇష్టపడుతుండటంతో, రోజు రోజుకి సర్వీసులు పెంచుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే బస్సుల్లోకి అనుమతిస్తున్నారు. బస్సు ట్రిప్ పూర్తైన వెంటన్ రసాయన ద్రావణంతో బస్సులను శుభ్రపరుస్తున్నారు. ద్వారకా కాంప్లెక్స్ పరిసర ప్రాంతమంతా నిత్యం సోడియం క్లోరైడ్ ద్రావణం చల్లుతున్నారు.
ఇదీ చదవండి: ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ కాంప్లెక్స్‌లు