గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ 100 శాతం స్థానిక అదివాసీలకే ఇవ్వాలనే జీవోను సుప్రీం కోట్టివేయడాన్ని నిరసిస్తూ.. జూన్ 9న జరిపే మన్యం బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ ప్రకటించింది. ఈమేరకు ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ ప్రకటన విడుదల చేశారు. సుప్రీం తీర్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటిని భర్తీ చేయాలని కోరారు. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న టీచర్ ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసీలకే 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 3ను కచ్చితంగా అమలు చేయాలన్నారు.
సుప్రీం తీర్పు వచ్చి 40 రోజుల గడిచిపోయినా ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఆదివాసీ ప్రజలు పోరాడి సాధించుకున్న చట్టాలను, జీవోలను రద్దుచేయడం సరికాదన్నారు రిజర్వేషన్ల ద్వారా సమస్య పరిష్కారం కాదని ఎస్సీ, బీసీ కులాలు గుర్తించాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఈ జీవో వల్లనే ఆదివాసేతరులైన ఎస్సీ, బీసీలకు ఉద్యోగాలు రావడం లేదనడంలో వాస్తవం లేదని వివరించింది. ఇప్పటికీ ఏజెన్సీలో వందల మంది ఆదివాసీలకు ఉద్యోగాలు లేవన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ దిశగా ఆదివాసీలు చేపట్టిన ఆందోళనలకు తమ పూర్తి మద్దతు ఇస్తున్నామని ఏవోబీ కమిటీ ప్రకటించింది.
ఇవీ చదవండి...