విశాఖవాలీ విద్యా సంస్ధ సమీపంలోని వెటరనరీ ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంఘంలో ఎప్పటి నుంచో సైట్ల వివాదం నడుస్తోంది. దీనిపై ప్రభుత్వం డివిజనల్ కోపరేటివ్ అధికారి మోషా విచారణ అధికారిగా నియమించింది. తాను సానుకూలంగా నివేదిక ఇస్తేనే అందరికి సైట్లు వస్తాయని మోషా ఈ సొసైటీ సభ్యులందరికి చెప్పాడు. 2కోట్ల రూపాయిలు కనీసం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఏప్రిల్ నెల నుంచి ఈ తతంగం నడుస్తోంది. ఎట్టకేలకు సొసైటీ సభ్యులు ఈయనకు రెండువందల గజాల స్ధలం దాదాపు కొటి రూపాయిల మార్కెట్ విలువ చేసేదాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరించారు. ఇది మోషా సోదరుడు మల్లిఖార్జునరావు పేరుపై రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్దం చేశారు.
ఈ సమాచారం తెలుసుకున్న అవినిరోధక శాఖాధికారులు రంగప్రవేశం చేశారు. విశాఖ టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తుండగానే అవినీతి చేపలను పట్టుకున్నారు. డాక్యుమెంట్ పూర్తి ప్రక్రియను రికార్డు చేసిన అనిశా అధికారులు... తర్వాత మోషాను అతని సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.