కొవిడ్ ప్రభావం(Corona Effect) పలు పరిశ్రమలపై పడటంతో… కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. విశాఖ జిల్లాలో విస్తరాకుల(leaf plates) పరిశ్రమ కూడా ఆర్థికంగా చితికిపోయింది. జిల్లాలోని నర్సీపట్నం డివిజన్లో రావికమతం, రోలుగుంట, బుచ్చయ్యపేట, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, కోటవురట్ల మండలాలతో పాటు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో విస్తర్ల తయారీ పరిశ్రమ కొనసాగుతోంది.
అడవిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఆకులను ఈ ప్రాంతాలకు చెందిన వేలాది మంది మహిళలు విస్తర్లుగా తయారుచేసి.. దుకాణదార్లకు విక్రయిస్తుంటారు వారు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. జిల్లాలో సుమారు 65 వేల మంది కార్మికులు విస్తర్ల(leaf plates) తయారీ పరిశ్రమపై జీవనోపాధి సాగిస్తున్నారు. ఇక్కడ తయారైన విస్తర్లను గ్రేడింగులుగా విభజించి తెలుగు రాష్ట్రాలలోని తిరుపతి , అన్నవరం , విజయవాడ , శ్రీశైలం , భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. వీటి తయారీలో రావికమతం మండలం కొత్తకోట దేశంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారుచేసిన విస్తరాకుల విక్రయాలతో..ఈ ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతుంటాయి.
శుభకార్యాల ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు , ప్రసాద ప్లేట్లు వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తుండటంతో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏడాది కాలంగా కరోనా లాక్డౌన్ ప్రభావం విస్తరాకుల పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఆశించిన స్థాయిలో విస్తరణ తయారీ జరగకపోవడంతో పాటు ఇతర రాష్ట్రాలకు , పుణ్యక్షేత్రాలకు ఎగుమతి చేయాల్సిన విస్తరాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు వారానికి 10 నుంచి 15 లారీలు విస్తర్లు ఎగుమతి అయ్యేవి. మలివిడత వైరస్ విజృంభణ మరింత అధికంగా ఉండటంతో ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకి వెళ్లాల్సిన విస్తరాకుల ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఈ పరిశ్రమ పై ఆధార పడ్డ వేలాదిమంది కార్మికుల పరిస్థితి ఆధ్వాన్నంగా మారింది.
ఇదీ చూడండి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ