విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం వరదనీటిని విడుదల చేసిన కారణంగా.. శారదా నది వరద ఉద్ధృతి పోటెత్తింది. కాజ్ వే కొట్టుకుపోయింది. ఈ కాజ్ వే మీదుగా అనంతగిరి, హుకుంపేట, దేవరాపల్లి మండలాలకు చెందిన 100 గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలు చేస్తుంటారు. ఇక్కడ వంతెన ఆరేళ్లుగా అసంపూర్తిగా ఉంది. రాకపోకలకు ఏకైక ఆధారమైన కాజ్ వే.. భారీ వరదకు ఉన్నది కాస్తా కొట్టుకుపోయింది. వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
ఈ క్రమంలో దేవరాపల్లిలో అనంతగిరి మండలం కొరపర్తికి చెందిన అంగన్వాడీ టీచర్ చనిపోయారు. ఆమె మృతదేహాన్ని శారదా నది అవతలపైపున ఉన్న స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసంపూర్తిగా ఉన్న వంతెన పైనుంచి ఎంతో కష్టంతో మృతదేహం తరలించారు. ఇప్పటికైనా కాజ్ వే ను సంపూర్తిగా నిర్మాణం చేయాలని సీపీఎం నాయకుడు వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు.