కమాండోల నమూనా విన్యాసం చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యానని... నన్ను చంపేయబోతున్నారేమోనని భయపడి పరుగులు తీశానని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు.
అసలేం జరిగింది...
ఆండ్రూ ఉన్న హోటల్లోని రిసెప్షన్ వద్ద ఉండగా హఠాత్తుగా బాంబు పేలింది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ఉన్న కమాండోలు ఆయుధాలతో హోటల్‌లోకి ప్రవేశించారు. ఈ హఠాత్పరిణామంతో కంగారుపడ్డ ఆండ్రూ ఫ్లెమింగ్... ఉగ్రదాడి అని భావించి భయాందోళనతో సమీపంలోని రిసెప్షన్ డెస్కు వెనక భాగంలో దాక్కున్నారు. తనకు గుండెదడ పెరిగిందని వాపోయారు. సమీపంలోనే ఉన్న మరికొందరు అతిథులు సైతం కంగారు పడ్డారు. కాసేపటికి కొందరు హోటల్ సిబ్బంది ఆయన్ని, అతిథులను చూసి నవ్వడంతో అంతా విస్తుపోయారు. నమూనా విన్యాసమని చెప్పేసరికి ఫ్లెమింగ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు గుండె సంబంధిత సమస్య ఉందని, తనకేమైనా అయితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. వాస్తవానికి నమూనా విన్యాసాలను ఉదయం పదింటికి నిర్వహిస్తారంటూ... హోటల్ సిబ్బంది నోటీస్ పంపినా 30 నిమిషాల ముందే చేయడంతో అంతా ఉగ్రదాడిగానే భావించారు. హోటల్ సిబ్బంది వైఖరి కూడా నిర్లక్ష్యంగా ఉందని, అతిథికి సమాచారం ఇవ్వాల్సిందిపోయి నవ్వి అవమానించారంటూ మండిపడ్డారు. వెంటనే డీజీపీకి ఫోన్ చేసి అండ్రూ ఫ్లెమింగ్ ఫిర్యాదు చేశారు.
వారం ముందే సమాచారం..
విశాఖ సీపీ ఆర్.కె.మీనాను డీజీపీ అప్రమత్తం చేశారు. అప్పటికే ఆండ్రూ ఫ్లెమింగ్ హోటల్‌ను ఖాళీ చేసి మరో హోటల్‌కు వచ్చేశారు. సీపీ ఆర్.కె.మీనా అక్కడికి వెళ్లి ఆయన్ని కలిశారు. హోటల్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేస్తామంటూ సముదాయించారు. హోటల్ యాజమాన్యానికి వారం ముందే సమాచారమిచ్చామని.. వారు అతిథులను అప్రమత్తం చేయకపోవటంతో కొందరు ఆందోళన చెందారని సీపీ వెల్లడించారు.
విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాల నుంచి మహిళల అక్రమ రవాణా జరుగుతోందని తమ అధ్యయనంలో తేలిందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. బ్రిటిష్ రాయబార కార్యాలయం తరఫున సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాడేరులోని ‘చైతన్య స్రవంతి’ సంస్థతో ఈ అంశంపై అధ్యయనం చేయించామని వివరించారు.