విశాఖపట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి మండలంలో బొర్రా గుహలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2300 అడుగుల ఎత్తులో తూర్పు కనుమల్లో ఈ గుహలు దాగి ఉన్నాయి. బొర్రా అంటే ఒడిశాలో రంధ్రమని అర్థం. కొండ దిగువన పెద్ద తొర్రలాంటి ప్రదేశం ద్వారా బొర్రా అందాలు చూడవచ్చు.
పర్యాటకుల తాకిడి
వేసవి తాపానికి పర్యాటకులు రద్దీ పెరిగింది. విశాఖ నుంచి అరకు వెళ్లే బస్సులు, కిరాండల్ పాసింజర్ రైలెక్కి బొర్రా గుహలు చేరుకోవచ్చు. గతంలో కాగడాలతో లోనికి వెళ్లే వారు... ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. రంగు రంగుల విద్యుత్ కాంతులు... సున్నపురాయిపై పడి ఈ ప్రకృతి గుహల అందానికి మరింత వన్నె తీసుకొస్తున్నాయి.
అందాలు తనివితీరా ఆస్వాదించాల్సిందే...
ఇంతటి అందాలు ప్రత్యక్షంగా చూస్తే గాని ప్రకృతి రమణీయతను ఆస్వాదించలేం. పర్యాటకుల కేరింతలు, గబ్బిలాలు కీచు శబ్దలతో గుహలో నిత్యం సందడి వాతావరణం కనిపిస్తుంది. కొండ లోపల వేలాడినట్లు కనిపించే శిలా ఖనిజాలు హత్తుకుంటాయి. ఇలాంటి సుందర దృశ్యాలు వీక్షిస్తూ... ఫొటోలు తీసుకుంటూ సందర్శకులతో నిత్యం కిటకిటలాడుతోందీ గుహ.
ఖర్చు తక్కువే...
పర్యాటక శాఖ పెద్దలకు 60, చిన్నపిల్లలకు 45 రూపాయలు తీసుకుంటే... సెల్ కెమెరాలకు 25, వీడియో కెమెరాలకు 100 చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేస్తోంది. ఏడాదికి సుమారు 3 నుంచి 4 లక్షల మంది పర్యాటకులు ఈ బొర్రాగుహలు సందర్శిస్తారు. ఈ గుహల్లో కొలువైన ఉన్న శివుణ్ణి బోడో పేరుతో ఇక్కడ గిరిజనులు కొలుస్తారు. గుహలో కొండ మెట్లపై అతి కష్టం మీద ఎక్కి దర్శించుకుంటారు ఇక్కడకు వచ్చే పర్యాటకులు.
బొంగుచికెన్ తినాల్సిందే...
బొర్రా గుహ అందాలు తిలకించి... బయటకొస్తే వెదుళ్ళుతో చేసిన గిరిజన కళాఖండాలు కొనుక్కుని, నోరూరించే బొంగుచికెన్ తిని రావాల్సిందే. బొర్రా తిలకించేందుకు పర్యాటక శాఖ విశాఖ నుంచి పర్యాటకులకు ప్రయాణ, విందు, విడిది కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇవి కూడా చదవండి: