పొట్టచేత పట్టుకొని ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో జలసమాధి అయ్యారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక సొంతింటికి వస్తున్న వారిలో ఆరుగురు విగతజీవులయ్యారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని సీలేరు నదిలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు నాటు పడవల్లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు చనిపోవడంతో పాటు ఇద్దరు గల్లంతయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులే కావడం విషాదాన్ని నింపింది. మరో మహిళ చనిపోయారు. గల్లంతైన వారిలో మహిళ, చిన్నారి ఉన్నారు. వారి ఆచూకీ కోసం మంగళవారం రాత్రి వరకు గాలించినా నిష్ఫలమే అయింది.
సీలేరు, మల్కాన్‌గిరి పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితిలోని కందగుడ, గుంటవాడ గ్రామాలకు చెందిన మూడు కుటుంబాలు మూడు నెలల కిందట తెలంగాణకు వలస వెళ్లాయి. సంగారెడ్డి ప్రాంతంలోని ఇటుక బట్టీలలో వారు పని చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రస్తుతం అక్కడ పనులు లేకపోవడంతో వారు స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. వలస కార్మిక కుటుంబాలకు చెందిన సుమారు 35 మంది సోమవారం రాత్రి సీలేరుకు చేరుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒడిశాలోకి వచ్చేవారు కొవిడ్ నెగెటివ్ రిపోర్టు లేదా టీకా రెండు డోసులు వేసుకున్న ధ్రువపత్రం తీసుకురావాల్సి ఉంటుంది. లేదంటే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలనే ఆంక్షలున్నాయి. తనిఖీలను తప్పించుకునేందుకు వారందరూ సీలేరు నదిలో ప్రయాణించాలని భావించారు. సోమవారం రాత్రి పదింటి సమయంలో సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టు సిబ్బంది కంటపడకుండా టేకు తోటల మీదుగా సీలేరు నది వద్దకు చేరుకున్నారు. తమ గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో వారు రెండు నాటు పడవలను పంపారు.
నాటు పడవలే ముంచుతున్నాయ్
ఒడ్డుకు చేరిన మృతదేహాల వద్ద బాధితకుటుంబ సభ్యుల రోదనలుమన్యంలో గెడ్డలు, నదులను దాటుతూ ప్రమాదాల బారిన సంఘటనలు గతంలోనూ చాలా ఉన్నాయి. ఎక్కువగా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలో విస్తరించిన మత్స్యగెడ్డలో ఈ తరహా ప్రమాదాలు జరిగి మృత్యుఒడిలోకి చేరినవారు ఉన్నారు.
* గతంలో మత్స్యగెడ్డలో నాటుపడవ మునగడంతో ముంచంగిపుట్టు నుంచి సుజనపేట పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుడు మృతిచెందారు.
* ఏనుగురాయి పంచాయతీలోని కుంభిగుడ గ్రామం వద్ద మత్స్యగెడ్డలో పడవ మునిగి ముగ్గురు విద్యార్థులతో పాటు అయిదుగురు ప్రాణాలు విడిచారు.
* పెదగుడ పంచాయతీలోని గలగండ గ్రామ సమీపంలో ఒడిశా నుంచి గలగండ గ్రామానికి నాటుపడవపై వస్తున్న ఇద్దరు ప్రమాదవశాత్తు నీట మునిగారు.
* జోలాపుట్టు జలాశయం దిగువ ప్రవహించే మత్స్యగెడ్డలో లక్ష్మీపురం పంచాయతీలోని సంగంవలస గ్రామ సమీపంలో గెడ్డదాటుతూ భార్యాభర్తలతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
వంతెనల్లేకే ప్రమాదాలు
ఇప్పటివరకూ సీలేరు నదిలోని ఎగువ భాగంలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు. దిగువ భాగంలో ప్రతి ఏడాదీ తరచూ ఏదో ఒక ప్రమాదం జరగడం ఒకరిద్దరు మృత్యువాత పడటం జరిగేది. సీలేరు నదిపై ఒడిశా వాసులు రాకపోకలు సాగించేందుకు పలుచోట్ల వంతెనల నిర్మాణాలకు గతంలో అనేక ప్రతిపాదనలు జరిగినా అవి నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగానే ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన ప్రాంతాల్లో రాకపోకలకు వీలుగా వంతెనల నిర్మాణాలను ఇరు రాష్ట్రాలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
కన్న కూతురిని కోల్పోయా..
ఇదే ఘటనలో తన భార్య లక్ష్మి, బిడ్డ షిండే గల్లంతయ్యారని, కుమార్తె రాణిని కోల్పోయానని ప్రాణాలతో బయటపడ్డ రమేష్ కన్నీరుమున్నీరవుతున్నారు. కన్నకూతురిని కళ్లముందే కోల్పోయిన ఘోరాన్ని జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోదిస్తున్నారు. కరోనా తమ పొట్టమీద కొడితే... విధి గర్భశోకం మిగిల్చిందని అంటున్నారు. తనవారి జాడ తెలియక ఒంటరిగా మిగిలానంటూ ఆవేదన చెందుతున్నారు.
ఇద్దరు బిడ్డలను కాపాడి..
నదిలో నాటు పడవల మునక ప్రమాదంలో ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ. పడవపై భార్య, తన నలుగురు బిడ్డలతో వస్తున్న కొర్రా సుధీర్ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి తన ఇద్దరు బిడ్డలను కాపాడుకోగలిగారు. ఇదే ప్రమాదంలో తన భార్య అనూష, తన చిన్న కుమారుడు అనీశ్వర్‌ను కోల్పోవాల్సి వచ్చిందని విలపిస్తున్నారు. రోడ్డు మార్గంలో వెళ్లి ఉంటే తమకు ఈ గండం ఉండేది కాదని గుండెలు బాదుకుంటూ రోదించారు.
ఇదీ చదవండి:
'యాస్' తుపాన్‌పై సీఎం సమీక్ష.. ఎక్కడా ప్రాణ నష్టం ఉండొద్దని ఆదేశాలు