PVN MADHAV COMMENTS ON JANASENA AND BJP ALLIANCE: జనసేన పార్టీతో పొత్తుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షంగా తాము జనసేనతో కలిసి ఉన్నా లేనట్టే ఉందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కోరినప్పటికీ.. జనసేన నుంచి ఎక్కడా ఎలాంటి ప్రకటన, మద్దతు లభించలేదని ఆయన వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ అభ్యర్ధులకు జనసేన మద్దతు ఉందని జరిగిన ప్రచారాన్ని సైతం ఖండించలేదని పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదనేది వాస్తవమని ఆయన అంగీకరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఇరు పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా అధినేత పవన్ కల్యాణ్, పీఏసీ ఛైర్మన్ మనోహర్ ఆలోచన చేయాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. లేకపోతే పేరుకే ఈ రెండు పార్టీల పొత్తు అని జనం అనుకుంటారని తెలిపారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా టీడీపీకు పడిందని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ ఆశిస్తోన్న రోడ్ మ్యాప్ అంటే.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడమేనని మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్‌కు మంచి అవకాశం ఉందని.. మచిలీపట్నం సభకు వచ్చిన జనాన్ని అంతా చూశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు పార్టీలు కలిసి పోరాటాలు చేస్తే.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇద్దరూ కలిసి ముందుకు వెళితే.. రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసేనాని పవన్.. టీడీపీతో వెళతారా లేదా అనేది.. తమకు తెలియదని.. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పదాధికారుల సమావేశంలో చర్చ జరగలేదని అన్నారు. కానీ ఇరు పార్టీల నేతలు కలిసి పని చేయాలనే అభిప్రాయాలను మాత్రం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. వైసీపీతో బీజేపీ కలిసి వెళుతుందనే ప్రచారం ఎక్కువగా జరిగిందని.. దీన్ని ప్రజలు కూడా విశ్వసించారని ఆయన తెలిపారు. బీజేపీకు గతంలో కంటే ఓట్లు ఎక్కువ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సొంతంగా పార్టీ ఎదిగేందుకు ఏప్రిల్ 14 వరకు వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఛారిషీటు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఇవీ చదవండి: