విశాఖ రైల్వేస్టేషన్‌లో సాధారణ ప్రయాణికుల తోపులాటలను నియంత్రించడానికి.. వాల్తేర్ ఆర్పీఎఫ్ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు బయోమెట్రిక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ ప్రయాణికుడు టికెట్ తీసుకున్న తర్వాత ఆ వ్యవస్థ వద్దకు వెళ్లి వేలిముద్ర వేస్తే.. ఒక నంబరుతో టోకెన్ వస్తుంది. దీని ఆధారంగా రైలులో సీటు పొందేలా ఆర్పీఎఫ్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.
సీరియల్ నెంబరు ఆధారంగా..
వాల్తేర్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్రకుమార్ శ్రీవాస్తవ శనివారం ఈ వ్యవస్థను రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు. టోకెన్ పొందిన ప్రయాణికుని సీరియల్ నంబరు ఆధారంగా అతని కంటే ముందు ఎంత మంది వచ్చారో తెలుస్తుందన్నారు. ప్రయాణికుని చిత్రంతో పాటు పూర్తి వివరాలు యంత్రంలో నమోదవుతాయని తెలిపారు. ఏడాది పాటు ఈ వివరాలు నిల్వ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విధానం వల్ల సాధారణ ప్రయాణికుల వివరాలు నమోదు చేయడంతోపాటు రద్దీ రైళ్లలో అనధికారికంగా సీట్లు అమ్మకాలను కట్టడి చేయవచ్చన్నారు. మొదటిగా ఈ వ్యవస్థను గోదావరి, రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, తిరుమల, కోర్బా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అందుబాటులోకి తీసుకురాన్నుట్లు వెల్లడించారు. నిఘా వ్యవస్థను మెరుగుపరచడానికి మానవ రహిత డ్రోన్ కెమెరాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: