సెలవులు వచ్చాయంటే పిల్లల చేసే అల్లరి.. ఆడే ఆటలు వేరు. అయితే సాధారణ సెలవులకు.. ప్రస్తుత లాక్‌డౌన్ సెలవులకు చాలా తేడా ఉంది. ఇంటిల్లిపాది ఇంట్లోనే రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. సాధారణంగా ఒకేచోట రోజుల తరబడి ఉండాలంటే చాలా విసుగ్గా ఉంటుంది. పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు ఆడుకోడానికి పిల్లలు ఆసక్తి చూపుతారు.
దీంతో వీధుల్లో పరుగులు తీయడం, చెరువులు, కాలువల్లో ఈతలు కొట్టాలని ఆరాటపడటం, బహుళ అంతస్తులుండే జనావాసాల్లో అంతా గుంపులుగా మేడ మీద చేరడం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా తేరుకోలేని విషాదం మిగిలే ప్రమాదముంది. జిల్లాలో కొద్దిరోజుల వ్యవధిలోనే ఆటలాడుతూ పలువురు పిల్లలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలవరపరిచింది. ఈ తరుణంలో ఇంటి దీపాలుగా నిలిచే కంటిపాపలను కాపాడుకోవడంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నది వైద్యనిపుణుల మాట.
కొన్ని విషాద ఘటనలు
* అనకాపల్లి నర్సింగరావుపేటలో ఈనెల19న సూర్యప్రతాప్ అనే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి మేడమీద తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఇంతలో నాలుగు అంతస్తుల మేడమీద నుంచి కింద పడిపోయి తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.
* విశాఖ నగరంలోని పీఎంపాలెంలో తుమ్మరిగెడ్డలో ఐదుగురు విద్యార్థులు నూతిలోకి దిగారు. ఇంట్లోనే ఉండి బోర్ కొడుతోందని సాయంత్రం వేళలో ఈతకు దిగిన చిన్నారుల్లో ఇద్దరు నూతిలో మునిగి మృతిచెందారు.
* నక్కపల్లి మండలం రమణయ్యపేటలో శనివారం ఓ యువతితో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థిని మృత్యువాత పడింది.
ఇలా చేస్తే మేలు
* సాధారణంగా సాయంత్రం వేళలో మేడమీద పిల్లలు ఆడుకోడాన్ని తల్లిదండ్రులు గమనించడం లేదు. ఈ సమయంలో పెద్దవాళ్లు ఓ కంట కనిపెట్టి ఉండాలి. పిల్లలను ఇంట్లోనే ఉంచి ఇండోర్ గేమ్స్ ఎక్కువగా ఆడుకునేలా చేయాలి.
* పిల్లలు ఎవరైనా ఆడుకుంటుంటే మరికొంత మంది అక్కడికి చేరుతారు. ఎంతసేపు ఇంట్లో ఉంటారు, కాసేపు బయటకు పంపిస్తే పోయేదేముందిలే అని తల్లిదండ్రులు అనుకోకూడదు. ఈ సమయంలో గుంపులుగా చేరడం వల్ల కలిగే అనర్ధాలపై వారికి అవగాహన కల్పించాలి.
* ఈనెల 23న ఉప్పాడ నేరెళ్లవలసలో అన్నయ్య ఫోన్ ఇవ్వలేదని పదోతరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కరోనా సమయంలో ఇంట్లోనే ఉంటున్న పిల్లలు ఫోన్‌కి ఎంత అలవాటు పడుతున్నారో ఈ సంఘటన అద్దం పడుతుంది. ఇంట్లోనే ఉంటున్న పిల్లలు ఫోన్‌ని ఎలా వాడుతున్నారు. ఎంతో సేపు ఇది వారి చేతిలో ఉంటుంది అనేదీ తల్లిదండ్రులు గమనించాలి.
సానుకూలంగా మార్చుకోవాలి
"లాక్‌డౌన్ వల్ల కుటుంబ సభ్యులు ఎక్కువ రోజులు ఉండే ఇంట్లోనే అవకాశం కలిగింది. దీన్ని సానుకూల, ఆరోగ్యకరమైన వాతావరణంలో కొనసాగేలా చూసుకోవాలి. ఈ సమయంలో పిల్లలకు ఇంట్లో పనులు అప్పగించాలి. వంటింట్లో చిన్నచిన్న పనులు, డైనింగ్‌టేబుల్ సర్దడం చేయిస్తుండాలి. పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసేలా వారికి నచ్చిన రంగంలో రాణించే మెలకువలను వారికి నేర్పించడానికి ఇది మంచి అవకాశం. ఇందుకు అంతర్జాలమూ ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులంతా పుస్తకాలు చదవడం, ఇండోర్ గేమ్స్ ఆడడం చేయాలి. కుటుంబ సభ్యులందరితో సరదాగా గడిపేలా చూడాలి. పిల్లలను ఒంటరిగా వదలవద్దు."
- డాక్టర్ భవాని, క్లినికల్ సైకాలజిస్టు, ఎన్టీఆర్ ఆసుపత్రి, అనకాపల్లి
డ్రోన్ కెమెరాలతో నిఘా
"లాక్‌డౌన్ అమలు తీరుపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం. చాలాచోట్ల అపార్ట్‌మెంట్, భవనాల మేడమీద సాయంత్రం వేళలో పిల్లలు, పెద్దలు గుంపులుగా ఉంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్న సంఘటనలు ఉంటున్నాయి. ఇలా చేయవద్దు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. డ్రోన్ కెమెరాలను చూసి కొంతమంది పరుగెడుతున్నారు. ఇలా చేయవద్దు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. లాక్‌డౌన్ నిబంధనలు పాటించి పోలీసులకు ప్రజలు సహకరించాలి"
- ఎల్.భాస్కరరావు, అనకాపల్లి పట్టణ సీఐ