కళలంటే అంటే మక్కువ.. చదువు సైతం వారిని కళాపోషణ దిశగా నడిపించింది.. ఆ రెండు చేతుల్లో మట్టి ముద్ద ఉన్నా.. చెక్క ముక్క చిక్కినా.. ప్రాణం పోసుకుంటాయి. ఆ బొమ్మలు చూస్తే ప్రాణం ఉన్నట్లు కనిపిస్తాయి.. వచ్చే నెలలో జరగబోయే ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల కళా ప్రదర్శనకు వారు సిద్ధమవుతున్నారు. తాము నేర్చుకుంటున్న విద్యకు మరింత పదును పెట్టి బొమ్మలను చెక్కుతున్నారు. కళా ప్రదర్శనలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు విద్యార్థులంతా ఇప్పటికే సిద్ధమయ్యారు. మరి కొన్ని రోజుల్లో బొమ్మలన్నీ తుది రూపు దిద్దుకోబోతున్నాయి.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ, పీజీ స్థాయి చిత్రకళ కోర్సు చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు తాము రూపొందించిన కళారూపాలను సగర్వంగా ప్రదర్శించేందుకు కృషి చేస్తున్నారు. చిత్రలేఖనం, కళాఖండాల రూపకల్పన, అచ్చు వేయడం లాంటి అంశాలతో విద్యార్థుల ప్రతిభ వారి సృజనాత్మకత కళ్లకు కట్టింది. మనసుకు హత్తుకునే రీతిలో తీర్చిదిద్దిన చిత్రాలు సందేశాన్ని ఇస్తూ ఆకర్షిస్తున్నాయి.
దేశంలోనే పేరొందిన కళా శిక్షణ వేదికల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఒకటి. ఇక్కడ చిత్రకళా కోర్సులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం విద్యార్థులు తరలివస్తారు. కళలపై పట్టుసాధించేందుకు ఏయు వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండడం సహా ఆచార్యులు సాటిలేని తోడ్పాటును అందిస్తున్నారు. విద్యార్థులు ప్రదర్శన కోసం రూపొందిస్తున్న చిత్రరూపాలు కొన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఇదీ చదవండి: చెరకు రైతులకు చక్కెరలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం