Asset value increase: రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి ఆస్తుల కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్న నేపథ్యంలో... విశాఖలో ఆస్తుల విలువ సవరణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ద్వారకానగర్, మధురవాడ, భీమిలి, ఆనందపురం, పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆస్తులను మదింపు చేయనున్నారు. గతంలో పెంచినవి.. ఇప్పుడు విలువ పెంపునకు అవకాశం ఉన్నవి.. కొత్తగా లేఅవుట్లు వేస్తున్నవి.. పరిశీలించి విలువ పెంపునకు ప్రణాళిక చేస్తున్నారు. ఈసారి ఆస్తుల విలువ హేతుబద్ధీకరణపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేలా ప్రణాళిక చేస్తున్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి విలువల మదింపు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
గతేడాదే విశాఖలోని చాలా ప్రాంతాలను గ్రిడ్లుగా విభజించి కొత్త మార్కెట్ విలువల ఖరారుకు కసరత్తు చేశారు. సర్వే నంబర్లు, డోర్ నంబర్లు కచ్చితంగా తెలుసుకునేందుకు భూనక్ష్య, ఏపీసాక్ యాప్‌ల సాంకేతిక సాయం తీసుకున్నారు. విలువల పెంపునకు అవకాశం ఉన్న స్థలాల వివరాలతో నివేదిక తయారు చేశారు. కొవిడ్ కారణంగా పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేయడంతో అది అమల్లోకి రాలేదు. ఏప్రిల్ ఒకటి నుంచి విలువల పెంపు అమల్లోకి వస్తుండడంతో గతంలో చేసిన నివేదికల ఆధారంగా మరోసారి తనిఖీలు చేసి మార్పులు చేయనున్నారు. వీఎంఆర్ డీఏ-2041 బృహత్తర ప్రణాళిక ఆధారంగా ఈ మార్పులు చేయనున్నారు.
ఇదీ చదవండి: Asset value increase: ఆస్తుల విలువ పెంపు... ఏప్రిల్ 1 నుంచి అమలు