వి.మాడుగులకు చెందిన జాగాని గంగమ్మ కుటుంబానికి చెందిన భూమిని 1982లో ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. అప్పట్లో తగినంత పరిహారం ఇవ్వనందున.. తీసుకోలేదు. దీనిపై భూయజమానులు తమ వద్ద తీసుకున్న భూమికి పరిహారం ఇవ్వాలని అప్పట్లో చోడవరం సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును ఆశ్రయించారు. భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టులో సైతం రైతులకు పరిహారం చెల్లించాలని తీర్పు వచ్చింది. తీర్పు వచ్చినా పరిహారం ఇవ్వనందున భూయజమానులు మళ్లీ చోడవరం కోర్టును ఆశ్రయించారు.
భూ యజమానులకు పరిహారం ఇవ్వనందుకు వి. మాడుగుల తహసీల్దార్ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఈనెల 20న చోడవరం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు కోర్టు అమీన్ మహేశ్వరరావు మాడుగుల తహసీల్దార్ రామశేషుకు నోటీసులో వివరాలు చదివి వివరించారు. అనంతరం కోర్టు జప్తు ఉత్తర్వులు, నోటీసులు కార్యాలయం గోడపై అంటించారు. కోర్టు ఉత్తర్వులు, జప్తు నోటీసు విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు తెలియజేస్తామని తహసీల్దార్ రామశేషు చెప్పారు.
ఇదీ చదవండి: సజావుగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్!