విశాఖలోని ప్రభుత్వ భూముల విక్రయ ప్రక్రియపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే వేలంలో కొనుగోలుదారులను ఆహ్వానిస్తూ.. జాతీయ భవన నిర్మాణ సంస్థ గత నెల 30న ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలంటూ.. విజయవాడకు చెందిన కె. హిమబిందు పిల్ వేశారు. ప్రభుత్వ భూముల విక్రయానికి రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవోలతో పాటు, భూముల విక్రయ నిమిత్తం ప్రభుత్వం తరఫున మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్.. ఎన్బీసీసీతో ఒప్పందం చేసుకోవడన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు.
ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన ప్రభుత్వమే విక్రయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని న్యాయవాది బి. నళిన్‌కుమార్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. గతంలో భూముల వేలానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్ చేశామని, అందులో మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. విశాఖలో భూముల వేలం ప్రక్రియ ప్రారంభించబోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా విచారణ జరపాలని, విక్రయ ప్రక్రియను నిలువరించాలని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈనెల 22న విచారణ జరుపుతామని తెలిపింది.
ఇదీ చదవండి:
న్యాయమూర్తులతో జస్టిస్ ఏకే గోస్వామి భేటీ.. విచారణ విధానంపై చర్చ