బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి 2007-08లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జారీ చేసిన అనుమతులను వెనక్కు తీసుకుంటూ... 6 జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. విశాఖ జిల్లాలోని అరకు, అనంతగిరి మండలాల పరిధిలోని జెర్రెల, గాలికొండ, రక్తకొండ, చింతమగొంది ప్రాంతాల్లోని బాక్సైట్ తవ్వకాలకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
జీవో నంబరు 80 ద్వారా విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని రక్తకొండ గ్రామ పరిధిలో 113.192 హెక్టార్ల బాక్సైట్ మైనింగ్ లీజును, జీవో 81 ద్వారా చింతపల్లి, అరకులో 152 ఎకరాల బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జీవో నంబరు 82 ద్వారా అనంతగరి మండలం గాలికొండలో 93.886 హెక్టార్ల మైనింగ్ లీజు, జీవో 83 ద్వారా జెర్రెల బ్లాక్–1లో 85 హెక్టార్లు, జీవో 84 ద్వారా జర్రెల బ్లాక్–2, 3లో 617 హెక్టార్లు, జీవో నంబరు 85 ద్వారా చింతపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో.. జర్రెల బ్లాక్–3 లో మరో 460 హెక్టార్లలో మైనింగ్ లీజులు రద్దు అయ్యాయి.
2016లో బాక్సైట్ సరఫరా కోసం రస్ అల్ ఖైమ, జిందాల్ సౌత్ వెస్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో ఏపీఎండీసీ కుదుర్చుకున్న ఒప్పందాల్ని తెదేపా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సంస్థలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను చాలా కాలంగా మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే శాసన సభ్యుడిగా ఉన్న కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు సివేరి సోమలను హత్య చేశారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తన పాదయాత్రలో బాక్సైట్ మైనింగ్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:మన్యంలో బాక్సైట్ తవ్వకాల లీజు రద్దు!