Achchennaidu sensational comments on Jagan: ''ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో సమ్మిట్‌లు పెట్టడం కాదు... ముందు ఒక ప్రెస్‌మీట్ పెట్టి పారిశ్రామికవేత్తలకు లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. త్వరలోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో యువతను మభ్యపెట్టేందుకే సమ్మిట్‌లు పెడుతున్నారు. టీడీపీ హయాంలో పెట్టుబడులు పెట్టిన అనేక పారిశ్రామికవేత్తలు.. జగన్ ధనదాహానికి భయపడి పారిపోయారు. పరిశ్రమలు రావాలంటే పెట్టాల్సింది సమ్మిట్‌లు కాదు..వాళ్లకి నమ్మకాన్ని కలిగించాలి. రాష్ట్రంలో ఏ ఒక్క ఇళ్లూ కట్టలేని జగన్.. పరిశ్రమలు ఎలా తెస్తారు?. చిత్తశుద్ధి లేని శివపూజలు చేస్తే ప్రజలు నమ్మరు'' అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్టణంలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నేటి నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో 'రాష్ట్రంలో పరిశ్రమల వాస్తవ పత్రాన్ని' విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. తాను తప్పు చేశానని సీఎం జగన్ ముందు లెంపలేసుకుని.. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలకు క్షమాపణ చెప్పాలన్నారు.
జగన్.. నాలుగు ఏళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయి, ఇప్పుడు యువతను మభ్యపెట్టడానికి విశాఖలో పారిశ్రామిక సమ్మిట్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక ఇల్లు కూడా కట్టలేని జగన్.. ఏపీకి పరిశ్రమలు ఎలా తెస్తారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని శివపూజలు ఎన్ని చేసినా జగన్‌ను, ఆయన మాటలను ప్రజలెవరూ నమ్మరని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మూడున్నర సంవత్సరాలుగా ఏపీని పూర్తిగా నాశనం చేసి.. ఇప్పుడు పెట్టుబడులు తీసుకువస్తామంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు.
అనంతరం దావోస్‌కు వెళ్లి పరిశ్రమలు తీసుకురావాల్సిన మంత్రి.. అక్కడ చలి తీవత్ర ఎక్కువగా ఉంటుందని అన్న పరిశ్రమల శాఖ మంత్రి ఏపీకి అవసరమా? అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా 1కి వెళ్లి.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది.. అది పిల్లలు పెట్టాలి.. అప్పుడు దానిని కోసుకొని తినాలి అంటూ మాట్లాడి ఆంధ్రప్రదేశ్ పరువు తీసేశాడని వ్యాఖ్యనించారు.
విశాఖలో నిర్వహించే సమ్మిట్ వల్ల పరిశ్రమలు రావని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలన్నీ.. వైసీపీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని గుర్తు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏమి తీసుకొచ్చారో? సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి