విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన ఓ వివాహిత.. తన భర్త, అతని తల్లిదండ్రులు, సోదరులు వేదిస్తున్నారని వాపోయింది. భర్త ప్రోత్సాహంతో ఆయన మిత్రులు తనపై లైంగికదాడులకు పాల్పడుతున్నప్పటికీ భరించానని.. వారి తీరు శ్రుతిమించడంతో పోలీసులను ఆశ్రయించానని పేర్కొంది.
'న్యాయం చేయాలని మార్చిలో పెందుర్తి పోలీసులను ఆశ్రయించా. వారు ఎలాంటి న్యాయం చేయలేదు. ఆగస్టు 6న దిశ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే న్యాయం చేస్తామని చెప్పారు. మరుసటి రోజు రమ్మని చెప్పినా నేను వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. రాలేని పరిస్థితిలో ఉన్నానని దిశ పోలీసులకు చెబితే.. పోలీసులను పంపి మళ్లీ పెందుర్తి పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులపై కేసు పెట్టకపోగా.. తనను ముందు కేజీహెచ్‌కు, ఆ తరువాత మానసిక వైద్యశాలకు తీసుకెళ్లారు' _ బాధితురాలు.
ఇది పోలీసుల పనేనా?
మహిళను మానసిక వైద్యశాలకు తీసుకువెళ్లటం పోలీసుల పనికాదు. రహదారులపై దిక్కులేకుండా పడిఉన్న వారిని, ఎవరూ పట్టించుకోని మానసిక వికలాంగులనే వారు తరలించాలి. అందుకు విరుద్ధంగా ఇక్కడ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆమె పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఒక ఇంట్లో నివసిస్తు న్నారు. రహదారులపై ఒంటరిగా మతిస్థిమితం లేకుండా తిరగలేదు. మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. న్యాయం చేయాలంటూ ఆమె దిశ పోలీసు స్టేషన్ కు ఇటీవల పిల్లలతో సహా వెళ్లారు. దిశ ఏసీపీకి ఫిర్యాదు కాపీ కూడా ఇచ్చారు. ఆమె పోలీసులతో మాట్లాడారు. పోలీసు సాయం కోసం డయల్ 100 ఫోన్ చేశారు. దిశ పోలీసులకు మంచిగా కనిపించినా.. పెందుర్తి పోలీసులకు మాత్రం మతిస్థి మితం లేని మహిళగా కనిపించిందా అనే సందే హాలు వ్యక్తం అవుతున్నాయి.
తల్లి ఒక చోట.. పిల్లలు ఒకచోట
తనను మానసిక వైద్యశాలలో చేర్పించిన బంధువులు, పోలీసులు తన పిల్లలను తీసుకెళ్లిపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నానని ఆమె పేర్కొంటున్నారు. తనకు కొవిడ్ వచ్చిందని పిల్లలకు చెప్పినట్లు తెలిసిందని ఆరోపించారు.
ముందే ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు..
"ఆరోగ్యం సరిగా లేకపోతే వారి బంధువులు, తోబుట్టువులు ముందుగానే మానసిక వైద్యశాలకు ఎందుకు తీసుకెళ్ల లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను మానసిక అసుపత్రికి తరలించే అధికారం పోలీసులకు ఉంటే.. ఇకపై స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నామనే పత్రాలతో వచ్చే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు."
మానసిక ఆరోగ్యం బాగోలేదనే ఇలా చేశాం..
'బాధిత మహిళ మానసిక ఆరోగ్యం బాగాలేదని భర్త, అతని తల్లిదండ్రులు, సోదరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు స్టేషన్‌కు వచ్చిందని పెందుర్తి సీఐ అశోక్ కుమార్ వివరించారు. మాతోపాటు దిశా పోలీసులు కూడా ఆమె ఫిర్యాదుపై విచారించారని తెలిపారు. ఆమె నిందితులుగా పేర్కొన్న వారిపై ఎలాంటి కేసులూ లేవని.. ఎలాంటి నేర చరిత్ర కూడా లేదని అన్నారు. ఆమె ఆరోపణలు నమ్మశక్యంగా లేవని అందుకే మానసిక ఆసుపత్రికి పంపినట్లు చెప్పారు. ఏ అఘాయిత్యానికైనా పాల్పడుతుందేమోనని ముందస్తు జాగ్రత్తగా ఆమెను మానసిక వైద్యశాలకు పంపామని పేర్కొన్నారు.
ఆమె ఆరోపణలు అవాస్తవం..
'ఆమె నా బంధువుల అమ్మాయే నేను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను. చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప ఎలాంటి తీవ్రమైన విభేదాలు లేవు. ఇటీవల తనంతట తానే ఒక గదిలో ఒంటరిగా ఉంటూ తాళాలు వేసుకుని ఉండేది. గతంలో తానే స్వధార్ హోమ్‌కు వెళ్లి వచ్చింది. మళ్లీ ఇంటికి వస్తానంటే తీసుకువచ్చాను' అని ఆమె భర్త వివరించారు.
ఇదీ చదవండి: