Assault under the influence of marijuana : పాఠశాలకు వెళ్లే విద్యార్థినులు.. కళాశాలకు వెళ్లే యువతులు.. కార్యాలయాలకు వెళ్లే మహిళలు, ఉద్యోగులు.. ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయం, పగటి వేళల్లోనే పరిస్థితి ఇలా ఉందంటే.. రాత్రిళ్లు అయితే తోడు లేనిదే అడుగు పడని భయానక పరిస్థితి విశాఖలో నెలకొంది. గంజాయికి అలవాటు యువకులు.. మత్తులో తూలుతూ విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల దాడుల సంస్కృతి పెరిగిపోగా.. గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని ప్రతిపక్షాలు గగ్గోలపెడుతున్నా.. ప్రభుత్వంలో చలనం కరువైంది.
సులభంగా డబ్బు సంపాదించాలని... విశాఖ నగరంలో ఇటీవల గంజాయి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. పాన్ షాపులతో పాటు చిన్న, చిన్న కిరాణా దుకాణాల్లోనూ ప్యాకెట్లు లభ్యమవుతున్నట్లు సమాచారం. ఈజీ మనీకి అలవాటు పడిన యువకులు గంజాయి రవాణా, అమ్మకాలపై ఆధారపడినట్లు తెలుస్తోంది. అడపాదడపా పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన యువకులు వెల్లడించిన విషయాలివే.
కుటుంబంపై దాడి.. విశాఖ నగరంలో షాపింగ్ ముగించుకుని ఇంటికి నడిచి వెళ్తున్న ఒక కుటుంబంపై ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దాడికి యత్నించి వివాహిత వస్త్రాలను చించేశారు. ఈ అమానవీయ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. పూర్ణామార్కెట్ సమీపంలోని రంగిరీజు వీధిలో నివాసముంటున్న వివాహిత(28), భర్త(33), కుమార్తె(6) బుధవారం రాత్రి షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మద్యం, గంజాయి మత్తులో ఉన్న ఆకతాయిలు వెంబడించారు. వీర్రాజు, సంపత్ ద్విచక్రవాహనంపై వెళ్తూ గట్టిగా హారన్ మోగించి వారు భయపడేలా చేశారు.
పోలీసులకు ఫిర్యాదు.. బాలిక భయపడి గట్టిగా కేకలు వేయడంతో తల్లిదండ్రులు ఆ యువకుల్ని హెచ్చరించారు. దాంతో ఆ యువకులు భార్యభర్తలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులను చించేశారు. వివాహిత రక్షణ కోరుతూ తన తమ్ముడు అభిలాష్ కు ఫోన్లో సమాచారం ఇవ్వగా... అతడు వచ్చి యువకులతో వాగ్వాదానికి దిగాడు. మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అతడిని కూడా తీవ్రంగా గాయపరిచారు. బాధిత కుటుంబం ఆసుపత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి :