108 emergency services: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. జనవరి 15వ తేదీ అనంతరం ఏ క్షణానైనా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ సీఐటీయు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ నాయకులు తమ డిమాండ్లను వెల్లడించారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ తమ సేవలను కొనియాడుతూ... తాను అధికారంలోకి వస్తే 108 ఉద్యోగులను ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించుతానని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తాము ఉద్యోగ నిర్వహణలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ యాజమాన్యం అయిన అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సంస్థ 108 ఉద్యోగులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. 108 సర్వీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకి ప్రతి సంవత్సరం 20 శాతం వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం తమకు చెల్లించాల్సిన మూడు నెలల జీతాన్ని తక్షణం చెల్లించాలని వెల్లడించారు. 108 వాహనానికి ప్రమాదం జరిగితే, ఉద్యోగులను వెంటనే విధుల నుండి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ వాటాలను చెల్లించకుండా, ఉద్యోగి యాజమాన్య వాటాలను ఉద్యోగి వద్ద నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించకుంటే రానున్న కాలంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: