విశాఖ జిల్లా మన్యం నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న యథేచ్ఛగా సాగుతుంది. గంజాయి రవాణాకు అక్రమార్కులు పలు మార్గాలు ఎంచుకుంటున్నారు. వాహనాల్లో అయితే పోలీసుల తనిఖీల్లో పట్టుబడతామని భావించి గంజాయి ప్యాకెట్లను చొక్కా లోపల పెట్టి ద్విచక్రవాహనాలపై తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే తరహాలో కోటనందురు మండలం కాకరపల్లి వద్ద ముగ్గురిని గంజాయితో పోలీసులు పట్టుకున్నారు. తుని మండలం కొలిమేరు వద్ద మరో నలుగురుని అరెస్ట్ చేశారు. వారినుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 4 కిలోల గంజాయిని స్వాధీం చేసుకున్నట్లు తుని సీఐ కిషోర్ బాబు తెలిపారు.
విజయనగరం జిల్లా లక్కవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో సోంపురం బ్రిడ్జి వద్ద ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి చేపట్టిన వాహన తనిఖీల్లో 4.6కిలోల గంజాయిని పట్టకున్నారు. ఎస్‌ఐ ప్రయోగమూర్తి అందిన వివరాల ప్రకారం... వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో విశాఖ జిల్లా డుంబ్రిగూడ నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి వద్ద గంజాయిని గుర్తించినట్లు తెలిపారు. గంజాయిని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తీసుకెళ్తున్నట్లు గుర్తించామన్నారు. ముగ్గురు నిందితులును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించనున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.