Tirupati Smart City : తిరుపతి నగరం మొత్తం ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలేసిన గుంతలు, రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారీకేడ్లు దర్శనమిస్తున్నాయి. భూమిలోంచి పైకి వచ్చిన తీగలు కారణంగా పాదచారులతో పాటు వాహనదారులు తీవ్ర ఇక్కట్లుకు గురవుతున్నారు. భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ నిర్మాణం పేరుతో నగరంలోని ప్రధాన రహదారులు తవ్వి వదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిర్మాణాలు ముందుకు సాగక తవ్విన గుంతలూ సరిగా పూడ్చక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో పచ్చజెండా : పనులు మొదలై మూడేళ్లు దాటినా భూగర్భ విద్యుత్ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న విధంగా మారిపోయాయి. తిరుపతి నగరాన్ని వ్రేలాడే విద్యుత్ తీగల రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారు. 2019లో భూగర్భ విద్యుత్ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. ప్రభుత్వం మారడం.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఈ పనులూ అటకెక్కాయి.
సకాలంలో నిధులు ఇవ్వని ప్రభుత్వం : పనుల జాప్యానికి నగరపాలక అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నా గుత్తేదారులకు సకాలంలో నిధులివ్వకపోవడంతోనే పనులు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రోడ్లు, భవనాలు, అటవీ శాఖ అనుమతుల్లో జాప్యంతో పాటు కరోనాతో రెండేళ్లు జాప్యం జరిగిందని అధికారులు ప్రకటించారు. కరోనా తగ్గి రెండు సంవత్సరాలు గడుస్తున్నా అన్ని అనుమతులు వచ్చినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
ట్రాఫిక్ సమస్యలు : భూగర్బ విద్యుత్ తీగల నిర్మాణం పేరుతో రహదారులు తవ్వేయడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు తవ్వి వదిలేయడంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని నగర వాసులు వాపోతున్నారు.
అర్థం చేసుకోవాలన్న మేయర్ : తిరుపతి నగరంలో చేపట్టిన భూగర్భ విద్యుత్ నిర్మాణాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని నగర మేయర్ శిరీష అంగీకరించారు. 2020 నాటికి పూర్తి కావాల్సి ఉన్న సాంకేతిక కారణాలతో పనులు జాప్యమవుతున్నాయన్నారు. సాంకేతికత ముడిపడిన అంశం కావడంతో నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని, నగర వాసులు సమస్యను అర్థం చేసుకోవాలని సూచించారు.
విమర్శలు.. ఆరోపణలు : ఎస్పీడీసీఎల్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంయుక్త చేపట్టిన భూగర్భ విద్యుత్ తీగల నిర్మాణాల్లో నిధులు పక్కదారి పట్టడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ వాటాగా చెల్లించాల్సిన నిధులను నగరపాలక అధికారులు దారి మళ్లించడంతో గుత్తేదారులు పనులను నిలిపివేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
"మన తిరుపతి స్మార్ట్ సిటీ అని చెప్పారు. పేరుకే స్మార్ట్ సిటీగా ఉంది. అప్పుట్లో అండర్ కేబుల్ వర్క్ తీసుకురావడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసిన వర్కులు ఈరోజుకీ కూడా జరగడం లేదు. ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాలలో పనులు జరగడం లేదు. తిరుపతిలో ఎక్కడ చూసిన గుంతలు తవ్వుతున్నారు కానీ అధికారులు స్పందించడం లేదు. " - స్థానికుడు
"కోవిడ్ వల్ల పనులు ఆలస్యమయ్యాయి. కొంచెం ఆలస్యం అయింది. పేమెంట్స్ ఇష్యూ కూడా ఉంది. అధికారులతో మీటింగ్ పెట్టి ఇప్పుడు ఫాస్ట్‌గా చేయాలని, వాళ్లని కోరడం అయ్యింది. అది ఈజీ వర్క్ కాదు. " - శిరీష, తిరుపతి మేయర్
ఇవీ చదవండి