Srivari Navratri Brahmotsavam : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అయింది.. ఈ రోజు రాత్రి పెద్దశేష వాహన సేవతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు కన్నుల విందు చేసేలా టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ, ఫల పుష్ప ప్రదర్శన శాలలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 3054 మంది పోలీస్ బలగంతో భక్తుల భద్రతకు బ్రహ్మోత్సవాల వేళ ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు.
అధిక మాసం కారణంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించిన టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేష వాహనంతో స్వామివారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.
దసరా పండుగ సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని భద్రత ఏర్పాట్లతో పాటు భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా అన్ని చర్యలు తీసుకుంది.
టీటీడీ ఏర్పాట్లతో తిరుమల గిరుల్లో పండుగ వాతావరణం సంతరించుకుంది. శ్రీవారి ఆలయం, తిరువీధులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ వెలుగుల ద్వారా ఏర్పాటు చేసిన దేవతా మూర్తుల ప్రతిరూపాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా తిరుమలను తీర్చిదిద్దారు. విద్యుత్ వెలుగుల మధ్య తిరుమలకొండపై బ్రహ్మోత్సవ సంబరాలు మొదలయ్యాయి.
తిరుమలలో ఫల పుష్ప ప్రదర్శనశాల భక్తులకు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేశారు. భావితరాలకు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలను తెలియచేసేందుకు.. ఆధ్యాత్మికతను పేపొందించే విధంగా టీటీడీ ఉద్యానవన విభాగం అధికారులు ఫలపుష్ప ప్రదర్శన రూపొందించారు. కల్యాణ వేదిక వద్ద పలు రకాల పుష్పాలతో నాలుగు యుగాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనలను.. దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా ఫలపుష్ప ప్రదర్శన శాలలో కేరళ అనంతపద్మనాభ స్వామివారి నమూనా ఆలయంతో పాటు నేల మాళిగలను ఏర్పాటు చేశారు.