BJP state president Somuveerraju: కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతుల ధరలు పెంచడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుపట్టారు. ప్రభుత్వం ధరల పెంపుదలే పరమావధిగా మార్చుకుందని విమర్శించారు. వసతి గదుల ధరలను రెట్టింపు కాదు మూడు రెట్లు పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తుమన్నారు. తిరుమల తిరుపతిలో ప్రస్తుతం ఉన్న వసతి సౌకర్యాలను మెరుగుపరిచామనే సాకుతో ధరలు పెంచడం ఎంత వరకు న్యాయమో తిరుమల పాలకమండలి భక్తులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తిరుమలలో గదుల ధరలను ఆకాశాన్ని అంటే రీతిలో పెంచేశారని ఆవేదన చెందారు. రూ.150 ధరలు ఉన్న ఒక్కో గదిని రూ.1700 పెంచారని.. ఇది మద్యతరగతి, సామాన్య భక్తులకు ఇబ్బందికరం అన్నారు. హిందూ దేవాలయాల్లో మాత్రమే ధరలు పెంచడానికి ఉన్న ప్రభుత్వంగా వైసీపీ కనపడుతోందని ఆరోపించారు. తిరుమల విషయంలో పాలకమండలి ధర్మంగా వ్యవహరించకుండా దర్శనానికి వచ్చే భక్తులను ముక్కుపిండి వసూలు చేసే విధంగా ధరలను ఆమాంతం పెంచేశారని ధ్వజమెత్తారు.
నారాయణగిరి రెస్ట్ హౌస్ 4లో ఒక్కో గది రూ. 750 నుంచి రూ.1700 పెంచారంటే పాలక మండలి కాఠిన్యం హిందువులకు అర్ధం అవుతోందని ఆరోపించారు. స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 ఉన్న గదిని రూ. 2200 పెంచారని... భవిష్యత్ లో భక్తులకు వసతి సౌకర్యం కలిగించరేమోనన్న అనుమానాలు వైసీపీ ప్రభుత్వం, పాలకమండలి పై కలుగుతోందన్నారు. వెంటనే పెంచిన ధరలను నిలుపుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: