SOMASILA CANAL : తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సాగునీరు.. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజవకర్గాల ప్రజలకు తాగునీరు అందించే సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాల్వ పరిస్థితి దారుణంగా మారింది. 350 కోట్ల రూపాయల అంచనాలతో సోమశిల-స్వర్ణముఖి కాలువ నిర్మాణాలు ప్రారంభించి... దాదాపు 220 కోట్ల మేర ఖర్చుపెట్టి కొంత మేర నిర్మాణాలు పూర్తిచేసి నీటిని విడుదల చేశారు. కానీ గడచిన మూడేళ్లలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయకపోగా...ఇప్పటికే పూర్తైన కాలువ నిర్వహణకూ నిధులు కేటాయించలేదు. ఫలితంగా కాలువ నిర్వహణ సరిగ్గా లేక పిచ్చిమొక్కలు పెరిగి వాటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది.
జిల్లాలోని రాపూరు, డక్కలి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లోని లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సోమశిల - స్వర్ణముఖికాలువ పనులు చేపట్టారు. ఈ కాలువ నుంచే పరిసర ప్రాంతాల జలాశయాలను నింపి 140 గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు.
సోమశిల - స్వర్ణముఖి కాలువ ఏర్పాటుకు అవసరమైన భూములు సేకరించినా....పరిహారం పంపిణీలో తీవ్ర ఆలస్యం అవుతోంది. ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో పరిహారం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదయాత్ర సమయంలో కాలువ నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగన్...మూడున్నరేళ్లు గడచినా ఎలాంటి పరిష్కారం చూపలేదని...కనీసం నిర్వహణకు నిధులు విడదల చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని మన్నవరం వద్ద అటవీ భూమికి సంబంధించి ప్రత్యామ్నాయంగా 19 ఎకరాల భూమిని బైరెడ్డిపల్లి మండలం కైగల్ గ్రామం వద్ద ప్రభుత్వం అటవీశాఖకు కేటాయించింది. ఈ భూములు స్వాధీనం చేసుకున్నా సాగునీటి శాఖ అధికారులు వాటిలో కాలువ నిర్మాణాలు మాత్రం చేయడం లేదు . ఫలితంగా కాలువ పనులు నిలిచిపోయాయి. రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లించడంతో పాటు....ఆగిపోయిన కాలువ నిర్మాణాలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: