Fire Accidents Mystery: తల్లి ప్రవర్తన నచ్చక.. ఆ యువతి ఎంత పని చేసిందంటే..! - తిరుపతి జిల్లా లేటెస్ట్ న్యూస్
Series of 12 Fire Accidents in One Village: ఆ గ్రామంలో వరుసగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఉన్నట్టుండీ గడ్డి వాములు తగలబడుతున్నాయి. ఇళ్లల్లో మంటలు వ్యాపిస్తూ.. దుస్తులు, నగదు దహనమవుతున్నాయి. ఇలా ఏకంగా 12 ఘటనలు జరిగాయి. ఈ వరుస ఘటనలకు కారణం.. క్షుద్రపూజలా..అనే అనుమానాలు గ్రామస్థుల్లో వ్యక్తం అవుతున్నాయి. అసలేం జరిగిందంటే..?
Series of 12 Fire Accidents in One Village: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కొత్త శానంబట్ల గ్రామంలో గత కొన్ని రోజులుగా వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామంలో గత 20 రోజులుగా ఒకే కుటుంబంలోని దాయాదుల ఇళ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయి. ఉన్నట్టుండీ.. గడ్డివాములు తగలబడుతున్నాయి. గ్రామంలోని పలు ఇళ్లల్లోని బీరువాల్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతోపాటు ఇంట్లో ఉన్న నగదు, దుస్తులు వాటంతట అవే మంటలు వ్యాపించి కాలిపోతున్నాయి. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 12 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
ఈ అగ్ని ప్రమాదాలకు గల కారణాలేంటో తెలియక.. స్థానికులు జుట్టు పీక్కుంటున్నారు. ఒకవేళ తమ గ్రామంపై క్షుద్రపూజలేమైనా జరుగుతున్నాయేమోననే అనుమానాలు గ్రామస్థుల్లో వ్యక్తమయ్యాయి. దీంతో తమ గ్రామంలోకి మంత్రగాళ్లను తీసుకుని వచ్చి.. గ్రామం నడిబొడ్డున గ్రామస్థులంతా పూజలు నిర్వహించారు. అయితే ఆ పూజలు చేస్తుండగానే.. గ్రామంలో తాళం వేసి ఉన్న మరో ఇంట్లో మంటలు అంటుకున్నాయి. ఓ వైపు ఈ మంటలు ఎలా వ్యాపిస్తున్నాయో తెలియక, మరోవైపు ఈ ఘటనలను అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం లేకపోవటంతో గ్రామస్థులంతా భయంతో బిక్కు బిక్కుమంటూ.. అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు.
వీడిన మిస్టరీ..: కొత్త శానంబట్లలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు సంబంధించిన మిస్టరీ వీడింది. ఎట్టకేలకు ఈ వరుస ఘటనలకు గల కారణాలు బయటపడ్డాయి. ఈ ఘటనలకు కారణం ఓ యువతి.. అవునండీ మీరు వింటుంది నిజమే.. ఎవరికీ అనుమానం రాకుండా, ఎవరి సహాయం లేకుండా.. చాకచక్యంగా 20 రోజుల నుంచి 12 వరుస ఘటనలకు పాల్పడింది ఒకే ఒక్క యువతి. పోలీసుల దర్యాప్తులో దీనికి సంబంధించిన నిగూఢరహస్యం బయటపడింది.
అగ్ని ప్రమాదాల నిగూఢరహస్యం.. : కీర్తి(19) అనే యువతి ఈ వరుస అగ్నిప్రమాదాలకు కారణం. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి కొత్త శానంబట్ల గ్రామంలో నివసిస్తోంది. అయితే ఆ యువతి తల్లి రాణి ప్రవర్తన నచ్చక ఆమె ఈ అగ్ని ప్రమాదాలను సృష్టించింది. తల్లి ప్రవర్తన నచ్చకపోతే.. గ్రామంలో వరుస అగ్ని ప్రమాదాలను సృష్టించడమేంటని అనుకుంటున్నారా..? అక్కడే అసలు విషయం దాగుంది. తల్లి ప్రవర్తన నచ్చకపోవటం వల్ల ఆ యువతి.. ఆమె తల్లికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల ఇళ్లను, వారికి సంబంధించిన వాటిని తగలబెట్టటం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో తన ఇంటికి కూడా పలుమార్లు నిప్పంటించింది. ఆమె తల్లి ప్రవర్తన కారణంగానే ఇలా జరుగుతున్నాయేమో అనే అనుమానం వారి కుటుంబాల్లో వస్తే.. ఈ అగ్ని ప్రమాదాలను కీడుగా భావించి.. తన తల్లితో పాటు ఊరు వదిలి వెళ్లే అవకాశం వస్తుందని ఆ యువతి భావించింది. ఈ ఆలోచనతోనే ఆ యువతి 20 రోజులుగా.. 12 వరుస అగ్ని ప్రమాదాలను సృష్టించింది. ఈ ఘటనలో నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె నుంచి 32,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితురాలి వద్ద నగదును స్వాధీనం చేసుకోవటమేంటి.. అని అనుకుంటున్నారా..? నిందితురాలు తన ఇంటికి కూడా పలుమార్లు నిప్పంటించింది.. ఓసారి ఆమె తల్లి రాణి.. స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లినప్పుడు.. నిందితురాలు తన ఇంట్లో తెరచి ఉన్న కప్‌బోర్డ్‌ను తగలబెట్టింది. ఆ సమయంలో కప్‌బోర్డ్‌లో ఉన్న 35,000 రూపాయల నగదును తీసేసి.. దుస్తులకు నిప్పంటించింది. ఆ నగదునే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదాలకు ఆ యువతి ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా.. అగ్గిపెట్టెతో మాత్రమే తన పనికానిచ్చినట్లు వారు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ విషయాన్ని ఒప్పుకుని.. నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: